సాక్షి, కామారెడ్డి: ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార పార్టీలోకి వలసలు జోరందుకోవడం సర్వసాధారణమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి గులాబీదళం ఆకర్ష్‌కు పదును పెట్టింది. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు కారెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోవాలి. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. సీఎం కేసీఆర్ పంపించే సైనికుడినే గెలిపించాలి’ అని బుధవా రం జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సభ లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో అన్ని ఎంపీ స్థానాలను గెలచుకునేందుకు ఆ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందని కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీల్లోని బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఫోకస్ చేసింది. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
జహీరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆరు స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 5,76,433 కాగా... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 4,43,468 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీకన్నా 1,32,965 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అదే 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 1,44,631 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందున మెజారిటీ మరింత పెరగాల్సిందని, కానీ గతంలోకన్నా తక్కువ ఓట్లు రావడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల శాతం ఎందుకు తగ్గిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్‌ను టార్గెట్ చేసుకుని ఓట్ల శాతం పెరిగేలా పార్టీ క్యాడర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేగాక ఎమ్మెల్యేలు తమతమ నియోజక వర్గాల్లో మెజారిటీ తేవడానికి ప్రయత్నించాలని ఓ రకంగా అల్టిమేటం జారీ చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటూ చురకలు కూడా అంటించారు.
ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును..
పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే కాదు మంచి మెజారిటీ రావాలన్న టార్గెట్‌తో ఎన్నికలకు సమాయత్తమైన టీఆర్‌ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది. ప్రత్యర్థి పార్టీలో ఉన్న బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో ఆ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజక వర్గానికి చెందిన నేతలకు గాలం వేయడానికి గులాబీ శ్రేణులు రంగంలోకి దిగాయి. నియోజక వర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి పార్టీ మారుతాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రసార మాద్యమాల్లో వచ్చిన ఈ వార్త గురువారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి, అవకాశాల కోసం పార్టీలో చేరమంటూ ఇతర పార్టీల నేతలకు గులాబీ దళం గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.
నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి..
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎదుటి పార్టీని బలహీన పర్చడంతో పాటు తమ బలాన్ని పెంచుకునేందుకు ఆకర్ష్‌కు పదును పెట్టినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలై, వారు నామినేషన్లు వేసేలోగా అవకాశం రాని నేతలు పార్టీ ఫిరాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలా మంది పార్టీలు మారుతారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment