
కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం
టీడీపీతో చేతులు కలిపినా ఫలితం శూన్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ‘ఆపరేషన్ ఆకర్ష్’ అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి సంపూర్ణమైంది. సాధారణ ఎన్నికల్లో మొదలైన హస్త పరాభవం స్థానిక పీఠాల పోరుతో ముగిసింది. అధికార పార్టీ అనుకూలత, సొంత పార్టీలోని నాయకత్వ లోపం, స్థానిక ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రయోజనాల ముందు కాంగ్రెస్ వ్యూహాలేవీ ఫలించలేదు. చివరకు ఆగర్భ శత్రువు తెలుగుదేశంతో జతకట్టి లబ్ధిపొందాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఫలితంగా అత్యధిక స్థానాలు సాధించి సుమారు 50కి పైగా స్థానిక పీఠాలనూ కాంగ్రెస్ చేజార్చుకుంది. అధికారపార్టీకి ఉన్న అనుకూలతలతో ఆయా పీఠాలన్నీ దాదాపుగా గులాబీ వశం కావడం గమనార్హం.
రంగారెడ్డిలోనూ ఫలించని వ్యూహం
తాజాగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని పంచుకునేలా తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి ఎత్తుగడల ముందు కాంగ్రెస్ ప్లాన్ ఫలించలేదు. టీడీపీ సభ్యులు టీఆర్‌ఎస్ వైపు వెళ్లడంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జెడ్పీలు సహా మరో 10 మున్సిపాలిటీలు, 41 మండల పరిషత్తుల్లో అధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఆయా పీఠాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. సాధారణ, స్థానిక ఎన్నికల్లోనే కాకుండా ఇటీవల జరిగిన శాసనమండలి చైర్మన్ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.