లీడర్ రాస్తే రీడర్ చదివినట్టు... : లక్ష్మణ్
బడ్జెట్‌పై బీజేఎల్పీ నేత లక్ష్మణ్
తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) నిర్మాణం, పటిష్టత, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్పించడంలాంటి వాటిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చూపిస్తున్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై చూపడం లేదు. తాజా బడ్జెట్ కూడా ప్రజావసరాలను, సమస్యల పరిష్కారానికి ఊతమిచ్చే కోణాలను చూపటం లేదు. అయితే ఐదు నెలల స్వల్ప పాలనాకాలాన్ని ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా భావించలేం, కానీ, ఈ కాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం సరిగా లేదు. ఇప్పటివరకు వేసిన తప్పటడుగులను వెంటనే సరిదిద్దుకోని పక్షంలో ప్రజలు వాతపెట్టడం ఖాయం.
ప్రగతిశీల ధృక్పథంతో ఉండే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ బడ్జెట్ విషయంలో మాత్రం సరిగా వ్యవహరించలేదు, లీడర్ రాస్తే రీడర్ చదివాడన్నట్టుగా.. ఆయన రీడర్ పాత్రనే పోషించారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ను మన పార్టీ-మన ప్రణాళికలాగా మార్చారు. బంగరు తెలంగాణలో ఉద్యోగాలకు కొదువ ఉండదని ఆశించిన విద్యార్థులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్, డీఎస్సీల నోటిఫికేషన్లు లేవు, రూ.1,300 కోట్ల మేర ఫీజు బకాయిలు పేరుకుపోయి పేద విద్యార్థుల ఉన్నత చదువులు డోలాయమానంలో పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేక బాలికలు చదువుకు దూరమవుతున్నారు. 330 మండలాల్లో తీవ్ర కరువు నెలకొన్న పరిస్థితిలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టకపోవటం దారుణం. రైతుల ఆత్మహత్యలు లేకుండా ఉండాలంటే ఛత్తీస్‌గఢ్ తరహాలో గిట్టుబాటు ధర అందే పరిస్థితి కల్పించాలి. స్కానింగ్ యంత్రాలకు కూడా సరిపోని నిధులను ఆస్పత్రులకు కేటాయించటమేంటి?.
సురేశ్‌ప్రభు విషయంలో మీరు చేసిందేంటి?: హరీశ్‌రావు
పార్టీ ఫిరాయింపులను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని లక్ష్మణ్ ఆరోపించినప్పుడు ‘మరి శివసేన నేత సురేశ్‌ప్రభు విషయంలో మీరు చేసిందేంటి?’ అని మంత్రి హరీశ్‌రావు ఎదురు ప్రశ్నించారు. అవసరమైతే ఆ పార్టీలకు రాజీనామా చేసిన తర్వాత చేర్చుకోండి, సురేశ్‌ప్రభు అలా రాజీనామా చేసే బీజేపీలో చేరారని లక్ష్మణ్ ముక్తాయించారు.