మహారాష్ట్రలో మహా అఘాడీ సంకీర్ణ సర్కారును కూలదోసిన కాషాయ పార్టీ ఇప్పుడు మరో రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేసినట్టు కనబడుతోంది. హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టుందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో బెంగాల్‌లో పట్టుబడడంతో ఈ వాదనకు బలం చేకూరింది.
కాంగ్రెస్ అలర్ట్
‘ఆపరేషన్ ఆకర్ష్’తో సోరేన్ సర్కారుకు ఎసరు పెట్టుందుకు కమలనాథులు సిద్ధమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోరేన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, పూర్తికాలం కొనసాగుతుందని ఏఐసీసీ రాష్ట్ర బాధ్యుడు అవినాష్ పాండే భరోసాయిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వాములైన వారి పట్ల అప్రమత్తంగా ఉన్నామని, సరైన సమయంలో కుట్రదారులపై వేటు వేస్తామని హెచ్చరించారు.
ఫిరాయింపుదారులకు వార్నింగ్
ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నకాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు.. సోరేన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠినవైఖరి అవలంభించాలని నిర్ణయించింది. అందుకే కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ వేటు చేసి ఫిరాయింపుదారులకు గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాదు జార్ఖండ్ కాంగ్రెస్ విభాగం 18 జిల్లాల్లో ఆందోళనలు కూడా చేపట్టింది. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో శాసనసభ్యుడు బెంగాల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇది రెండోసారి.. నాకేం తెలియదు
హేమంత్ సోరేన్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నించడం ఇది రెండోసారని అవినాష్ పాండే తెలిపారు. ప్రస్తుత కుట్ర వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని ఆయన పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు. సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాను ప్రయత్నించడం లేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. 22 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగినందున ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, సీనియర్ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనపై కాంగ్రెస్ ఎందుకు కేసు పెట్టిందో తెలియదన్నారు.
హిమంత ప్రోద్బలంతోనే..
సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. హిమంత బిశ్వ శర్మ ప్రోద్బలంతో తనకు 10 కోట్ల రూపాయలు, కొత్త ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఆశచూపారని ఆరోపిస్తూ బెర్మో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జయమంగళ్.. రాంచిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కారులో డబ్బు పట్టుబడిన తర్వాతే ఎందుకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నకు జయమంగళ్ వద్ద సమాధానం లేదు. మరోవైపు సీఎం సోరేన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికార పక్షంలో గుబులు మొదలైంది. (క్లిక్: రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్)
Comments
Please login to add a commentAdd a comment