
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. విశ్వాస పరీక్షలో గెలుపొందేందుకు ‘ఆపరేషన్ కమల్’కి తెరలేపింది. అసెంబ్లీలో బల నిరూపణకు ప్రస్తుతమున్న 104 ఎమ్మెల్యేలు సహా మరో 8 మంది బీజేపీకి అవసరం. దీంతో మిగిలిన వారి కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఆపరేషన్‌లో చిక్కుకోకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. కుమారస్వామి, సిద్దరామయ్య సహా జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్యనేతలు కొచ్చిలోని ‘క్రౌన్ ప్లాజా’ 5స్టార్ హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోటల్ ముందు కేరళ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అయితే.. వీరిని తరలించేందుకు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక విమానానికి డీజీసీఏ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రోడ్డుమార్గంలో పుదుచ్చేరికి తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఒక్కరొక్కరుగా..
హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (కాంగ్రెస్) రిసార్టుకు రాకుండానే అదృశ్యమయ్యారు. దీనికి తోడు.. బుధవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ రిసార్టు నుంచి బయటకెళ్లిన మస్కి ఎమ్మెల్యే ప్రతాప గౌడ తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేదంటూ గురువారం రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వీరి ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో కూటమిలో కలవరం మొదలైంది.
క్యూలో మరికొందరు!
కాంగ్రెస్‌కు చెందిన కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరితో కమలదళ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకరరెడ్డి, స్వతంత్ర ఎమ్మెల్యేలు నాగేష్, శంకర్‌లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment