ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో కనిపించిన ఊపును స్థిరం చేసుకునే దిశలో కమలనాథులు అడుగులేస్తున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా...ఎన్నికల ముందు నిర్దేశించిన లక్ష్యా న్ని సాధించే క్రమంలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా తలపడేందుకు అడుగులేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచి మంచి ఊపులో ఉన్న బీజేపీ ఇప్పుడు మరింత బలపడేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆపరేషన్ తెలంగాణ, ఆపరేషన్ ఆకర్ష్‌ను ఎన్నికలకు ముందునుంచే ప్రారంభించిన బీజేపీ ఇపుడు ఆ ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇప్పటికే టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాపోలు ఆనంద భాస్కర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరగా, ఇపుడు మరిన్ని చేరికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు టీడీపీ ఖాళీ అయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవటంతో నేతలు నైరాశ్యంలో ఉన్నారు. వారితోపాటు పార్టీ కార్యకర్తలను తనవైపు తిప్పుకోవాలని బీజేపీ సిద్ధమైంది. తాజాగా ఆ పార్టీ నేతలు కొందరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌తో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే టీడీపీ నేతలు బీజేపీకి టచ్‌లోకి రావటం విశేషం.
కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లి అక్కడే ఉన్నారు. టీడీపీ నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, హన్మకొండ మాపీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ తదితరులు లక్ష్మణ్æతో దాదాపు గంటపాటు చర్చించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మర్యాద పూర్వకంగానే లక్ష్మణ్‌ను కలిశామని ఆయా నేతలు పేర్కొన్నా.. వారు బీజేపీలో చేరేందుకు సిద్ధమై చర్చలు జరిపినట్లు సమాచారం.
వీరితోపాటు ఆ పార్టీ తెలంగాణ నేతలు మరికొందరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల ముందే పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనను బీజేపీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. చివరి క్షణంలో ఆయన పార్టీలో చేరలేదు. అయితే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment