సెంచరీపై టీఆర్‌ఎస్‌ ధీమా | TRS Start Operation Akarsh | Sakshi
Sakshi News home page

మరో ఆరుతో నూరు!

Published Mon, Mar 4 2019 1:48 AM | Last Updated on Mon, Mar 4 2019 9:35 AM

TRS Start Operation Akarsh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనుకున్న లక్ష్యాల సాధనగా టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. ఐదుగురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం.. 16 ఎంపీ సీట్లను సాధించేదిశగా పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. దీనికితోడు వంద సీట్లు సాధించాలని మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టార్గెట్‌ పెట్టుకున్నప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలో అంతర్గత పరిణామాలతో 100సీట్ల లక్ష్యానికి కొంచెం దూరంలో ఆగిపోయింది. అయితే ఆ అసంతృప్తిని సరిదిద్దుకునేందుకు.. లెక్కను సరిచేయాలనే లక్ష్యంతో మిషన్‌పై దృష్టిపెట్టింది. టీఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని ఇతర పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా నెరవేర్చే పరిస్థితి వచ్చింది.గత శాసనసభలో చేరికల వ్యూహానికి భిన్నంగా ఈసారి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు (కోరుకంటి చందర్‌– రామగుండం, లావుడ్య రాములు నాయక్‌ – వైరా) టీఆర్‌ఎస్‌లో చేరారు. అధికార పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్, టీడీపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రకటించారు. త్వరలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌ రావు సైతం అధికార పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నలుగురి చేరికతో టీఆర్‌ఎస్‌ బలం 94కు చేరనుంది. లోక్‌సభ ఎన్నికలలోపు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉండడంతో.. గులాబీ పార్టీ పెట్టుకున్న వంద మంది ఎమ్మెల్యేల లక్ష్యం పూర్తి కానుంది. 
 
వచ్చే వారికి స్వాగతం 
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేందుకు విషయంలో టీఆర్‌ఎస్‌ ఈసారి విభిన్న వైఖరితో వ్యవహరిస్తోంది. గత శాసనసభలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ముందుగా సంప్రదింపులు జరిపేది. ఇప్పుడు మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల ప్రతిపాదనను అంగీకరిస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరుతామని ఆ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించే ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి చేరికల ప్రక్రియను పూర్తి చేస్తోంది. 2015లో జరిగిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు ఉదంతం తర్వాత టీఆర్‌ఎస్‌ ఈ వ్యూహానికి మరింత పదునుపెట్టింది. తెలంగాణలో టీడీపీని పూర్తిగా బలహీనపరిచేలా వ్యవహరించింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానమే ముందుగా చొరవ తీసుకుని ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో సంద్రింపులు జరిపింది. వారి అవసరాలను తెలుసుకుని దీనికి అనుగుణంగా పార్టీలో చేర్చుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో టీఆర్‌ఎస్‌ సొంతంగా 65 సీట్లు గెలుచుకుంది. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు, వైఎస్సాఆర్‌సీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక్కరు చొప్పున మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 90కి చేరింది. అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలు జరిగాయి. వంద స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ పదేపదే చెప్పారు. అనుకున్నట్లుగానే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు. 
 
ఖరారుకాని ముహూర్తం 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతరావు, ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరే ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. గులాబీ కండువా కప్పుకోబోతున్నామంటూ వీరిద్దరు శనివారం ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆదివారం అధికార పార్టీలో చేరే కార్యక్రమం ఉంటుందని సంకేతాలిచ్చారు. వీరి చేరిక ముహూర్తంపై స్పష్టత రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు మరికొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి వీరిద్దరు పార్టీలో చేరతారని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేలోపు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల చేరిక కార్యక్రమం ఉంటుందంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరిక ముహూర్తాన్ని కేసీఆర్‌ ఇంకా ఖరారు చేయలేదని టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement