సాక్షి, కల్వకుర్తి: నామినేషన్ల పర్వం సాగుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలోనే అసమ్మతి నాయకులకు గాలం వేయడానికి ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆకర్ష్ పథకం అమలు చేస్తున్నాయి.
బీజేపీ మాత్రం రెండు పార్టీల నాయకులపై దృష్టి సారించింది. టీఆర్‌ఎస్‌లో ఉన్న వారిని కాపాడుకోవడానికి అసమ్మతి నాయకులను బుజ్జగిస్తూ కాంగ్రెస్ అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ మాత్రం టీఆర్‌ఎస్ అసమ్మతి, అసంతృప్తి నాయకులు, కార్యకర్తలపై నజర్ వేసింది. ఈ మూడు పార్టీలు నాయకులకు, కార్యకర్తలకు, ఎవరు వచ్చినా వారికి పార్టీల కండువాలు కప్పడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏదిఏమైనా నియోజకవర్గంలో ఆకర్ష్ పథకం జోరుగా సాగుతుంది.
అసెంబ్లీ రద్దు నుంచి..
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి ఈ ఆకర్ష్ పథకం ఆరంభమైంది. అంతకు ముందు ఎవరు ఏ పార్టీ నాయకుడిని పట్టించుకోలేదు. ముందుస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి అసంతృప్తులు, అసమ్మతి నాయకులకు ఫోన్‌లు చేయడం, కలవడం మొదలెట్టారు. అప్పటి నుంచి సాగుతున్న కండవాలు కప్పటం నేటికి సాగుతూనే ఉంది. సట్టణాలు, మండల కేంద్రాలు, పల్లెలో, గిరిజన తండాలు, చివరకు కాలనీలు సైతం ప్రస్తుతం రాజకీయపార్టీలకు కండువాలు కప్పే ట్రెండ్ జోరుగా సాగుతుంది.
పెద్ద రాజకీయ నాయకుల నుంచి చిన్న కార్యకర్త వరకు అన్ని పార్టీలు కండువాలు మెడలో వేసి ఓ ఫోటోకు ఫోజులిప్పించి ఇక మన పార్టీ వారే నని సంబరపడిపోతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థుల ముందు మెప్పుపొందడానికి గ్రామాల్లోని మహిళలను, కూలీలను సైతం వదలడం లేదు. ఆ తర్వాత వారికి కొంతమేర కూలీ ముట్టజెబుతున్నారు.
ఒకరోజు ఒకపార్టీ.. మరుసటి రోజు మరో పార్టీ
పార్టీల కండువాల సంస్కృతి నవ్వుల పాలుచేస్తోంది. యువకులు కొందరు ఒక రోజు ఒక పార్టీ కండువాలు మెడలో వేసుకొని మరుసటి రోజు మరో పార్టీ కండవాలు మెడలో వేసుకోవడం ఫొటోలకు పోజులివ్వడం సాధారణంగా మారింది. దీనికి కారణం డబ్బులు చేతులు మారడమనే విమర్శలున్నాయి.
పెద్దనాయకులే కొందరు ఒకరోజు ఒక పార్టీలో మారుతున్నామని చెప్పి రెండు మూడు రోజులకు మరోపార్టీలో చేరుతున్నారు. ఈప్రాంతంలో ఓనాయకుడు తన ఇంటిపై ఒకపార్టీ జెండాలు సైతం ఎగురవేసి మరసటిరోజు మాటమార్చారు. ఇందుకు కారణం రాజకీయ భవిష్యత్‌తోపాటు కాసుల లెక్క తేలకపోవడమేనని గుసగుసలు విన్పిస్తున్నాయి.
డబ్బులిస్తేనే కండువా మెడలో..జెండా చేతిలో
ఎన్ని సంస్కరణలు వచ్చినా సోషల్ మీడియా పెరిగి పోతున్నా ప్రతి ఎన్నికల్లో వ్యయం పెరిగిపోవడంతోపాటు విలువలు సైతం పోతున్నాయి. అక్షరాస్యత పెరిగిపోతున్నా ఓటర్లలో మాత్రం తనకేంటి అన్న «ధోరణే పెరిగిపోతుంది. కాసులిస్తే ఏ పార్టీ కండువైనా కప్పుకుంటాం.. జెండా మోస్తామని నిసిగ్గుగా చెప్పుతున్నారు. ఓటు మాత్రం తనకు నచ్చిన వారికి మాత్రమే వేస్తామని అంటున్నారు.
సభలు, సమావేశాలు నిర్వహిస్తే..
ప్రస్తుతం నియోజవర్గంలో ఏ పార్టీ సమావేశాలు పెట్టినా, సభలు, ర్యాలీలు పెట్టినా వ్యయం చేస్తే చాలు జనం భారీగా తరలివస్తున్నారు. ఒక మహిళకు రూ.250 నుంచి రూ.300 కూలీ, మగవారికి రూ.300, ఒక క్వాటర్ మద్యం, యువకులకు మాత్రం మద్యం ఖర్చు అధికం. వీరికేకాదు నిత్యం తిరిగే కార్యకర్త సైతం మద్యం, డబ్బులు ఇవ్వకపోతే పెదవి విరచడంతోపాటు కొందరు అలిగిపోతున్నారు. ఇక వాహనాలకు తడిసిమోపడుఅవుతుంది. కాసులు లేనిదే ఎన్నికల్లో జెండా ఎగురదు..ప్రచారం సాగని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment