సొంతగూటికి జంప్ జిలానీలు!
మేడ్చల్: టీఆర్‌ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా ఆ పార్టీలో చేరిన కొందరు టీడీపీ నాయకులు తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ వర్గాల సమాచారం మేరకు.. టీఆర్ఎస్‌లోకి రెండు నెలల క్రితం మేడ్చల్ మండలానికి అప్పటి టీడీపీ సీనియర్ నాయకులు పెద్దఎత్తున మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డితో కలిసి సొంతగూటిని వీడి అధికార పార్టీలో చేరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు, బడానేతలంతా గంపగుత్తగా పార్టీని వీడిపోయారు. అయితే, ‘గులాబీతోట’ వారి చేరికకు ముందే హౌస్‌ఫుల్ కావడంతో టీడీపీలో దక్కిన ప్రాధాన్యత జంప్ జిలానీలకు అక్కడ దక్కలేదు. దీంతోవారు తమ సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో మేడ్చల్ మండలం టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మండలానికి చెందిన సర్పంచ్‌లు, మేడ్చల్ నగర పంచాయతీకి చెందిన నాయకులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుటున్నారని తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఈనెల 14న ఆ పార్టీ తెలంగాన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శామీర్‌పేట్, కీసర మండలాలకు చెందిన కొందరు నాయకులు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సొంతపార్టీలో ఉన్న వలస నేతలపై, సర్పంచ్‌లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. పార్టీ మార్పు విషయం ఆయనకు తెలిసిపోవడంతో విమర్శలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.