చౌటుప్పల్ మండలంలోని ఒక సర్పంచ్ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ దాట వేస్తుండటంతో సదరు సర్పంచ్ మిగతా డబ్బులు ఇస్తారా? లేదా? అనే ఆలోచనలో పడ్డారు.
చండూరులో ఒక ముఖ్య నేత ఒక ప్రధాన పార్టీలో చేరారు. అక్కడ రూ.40 లక్షలు ఇస్తామని చెప్పారు. డబ్బులు తీసుకొని మళ్లీ ఫిరాయిస్తున్నారని ఆ పార్టీ వెంటనే డబ్బులు ఇవ్వలేదు. దీంతో మరో పార్టీ అదే మొత్తం ఇస్తామంటూ ఆయన్ను సంప్రదించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. కానీ వారిచ్చింది రూ.5 లక్షలేనని తెలిసింది.
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుందామనుకుని పార్టీలు మారిన నేతల ఆశలు అడియాశలవుతున్నాయి. భారీ మొత్తాలు ఎరగా వేసి చేర్చుకున్న పార్టీలు, హామీ ఇచ్చిన లేదా ఒప్పందం చేసుకున్న నగదులో సగమో, పావు వంతో ఇచ్చి మిగతా మొత్తానికి రేపు, మాపంటూ ముఖం చాటేస్తుండటంతో.. గోడ దూకిన ప్రతినిధుల పరిస్థితి ‘కక్కలేక మింగలేక’అన్నట్టుగా తయారయ్యింది.
స్థాయిని బట్టి రూ.40 లక్షల వరకు..
మునుగోడులో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు.. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులకు గాలం వేస్తున్నాయి. వలలో వేసుకునేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపుతున్నాయి. స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆశ చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో నేతలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు వందల సంఖ్యలో నేతలు పార్టీలు మారడం గమనార్హం. కాగా వీరిలో చాలామందికి కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డబ్బులు దక్కలేదని తెలుస్తోంది.
ఫిరాయింపు భయంతో కోత..
ఇస్తామన్న డబ్బులు మొత్తం ఇవ్వకపోవడంతో పార్టీలు మారినవారంతా తమను వలలోకి దింపినవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఈ విషయంలో కొంత తెలివిగా వ్యవహరిస్తున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. డబ్బులు మొత్తం ఇచ్చాక ఒకవేళ వారు మళ్లీ పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటన్న జాగ్రత్తతోనే సగమో, పావు వంతో ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే.. డబ్బుకు ఆశపడి పార్టీ మారితే అనుకున్న మొత్తం రాకపోగా, పరువు పోయిందని నాంపల్లి మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన వారి పరిస్థితి ఇలా ఉంటే.. తాము పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా ఫలితం లేకుండా పోతోందని కొందరు వాపోతున్నారు. ముఖ్యనేతలు తమను పట్టించుకోవడం లేదని, తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారంలో పాల్గొంటున్నామని కొందరు కిందిస్థాయి నేతలు నిరాశ వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మరికొన్ని బేరాలు..
– చౌటుప్పల్ మండలంలో ఒక పార్టీకి చెందిన సర్పంచ్ వేరే పార్టీలో చేరారు. రూ.20 లక్షలకు బేరం కుదిరినా అందులో రూ.5 లక్షలే అందినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే అధికారంలోకి వచ్చాక ఇస్తామంటూ దాటవేస్తున్నారని ఆ సర్పంచ్ వాపోతున్నారు.
– మునుగోడు మండలంలోని ఒక పార్టీకి చెందిన సర్పంచ్ మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఇస్తామనే హామీ లభించింది. ఈయనకు కూడా రూ.5 లక్షలే అందాయని, మిగతా మొత్తం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని తెలిసింది.
– నారాయణపూర్ మండలంలో ఒక గ్రామ సర్పంచ్‌తో రూ.10 లక్షలకు బేరం కుదిరింది. తీరా రూ.3 లక్షలే చేతిలో పెట్టి కండువాను కప్పి వదిలేశారు.
– నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుడు ఒకరు రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నా రూ.5 లక్షలే ఇవ్వడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment