సాక్షి, హైదరాబాద్:
అధికార టీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మార్లు చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఓ అంచనాకు వచ్చేలా ఫలితాలు ఉపయోగపడ్డాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నా ఏ కారణాల చేతనో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవతోందంటున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఈ అసంతృప్తి మరింతగా ఉందని సమాచారం. ప్రభుత్వ పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజాభిప్రాయం ఎంతో సానుకూలంగా ఉన్నా, కొందరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అలా లేదంటున్నారు. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా ఈ మేరకు పార్టీ అధినేతకు సమాచారం కూడా చేరిందని చెబుతున్నారు. జంప్ జిలానీలుగా ముద్రపడిన ఇతర పార్టీలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 63 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణల పేర జరిగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం ఏకంగా 88కి పెరిగింది. కాం గ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. వీరిలో గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్ శాసన సభాపక్షంలో విలీనం అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీకి చెందిన 12 మంది, వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం అయ్యారు. కాగా, కాంగ్రెస్‌నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నా శాసనసభ రికార్డుల్లో మాత్రం వారు గెలిచిన పార్టీల సభ్యులుగానే కొనసాగుతున్నారు. మొత్తంగా ఈ 25 మంది ఎమ్మెల్యేల్లో ఓ ఇద్దరు ముగ్గురు మినహా మిగతావారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలతో దూరం పెరిగిందన్న సమాచారం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మింగుడుపడని సమాచారం..
జంప్ జిలానీ ఎమ్మెల్యేలతో పాటు టీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దీనికన్నా ఏం భిన్నంగా లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కనీసం నూరు స్థానాల్లో గెలుపును లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌కు ఈ సమాచారం మింగుడుపడటం లేదంటున్నారు. దీంతో అటు పార్టీ పరిస్థితి, ఇటు ప్రభుత్వ పనితీరూ బాగా ఉండి కొందరు ఎమ్మెల్యేల విషయంలోనే ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందో తెలుసుకునేందుకు గులాబీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే కొందరు సిట్టింగ్‌ల మెడపై కత్తి వేలాడుతున్నట్టేనని పార్టీ వర్గాలు అను కుంటున్నాయి.
కారణాలపై ఆరా..
ప్రజల్లోకి చొచ్చుకుపోలేక పోతున్నారా? వారితో నిత్య సంబంధాలను కొనసాగించలేక పోతున్నారా? అభివృద్ధి పనులు చేపట్టి, వాటిని పూర్తి చేయడంలో వెనుకబడి పోతున్నారా? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెదకడం ద్వారా గులాబీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం మొదలు పెట్టిందని చెబుతున్నారు. అరవైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని క్షేత్రస్థాయి సమాచారంతో విశ్లేషిస్తున్నారని అంటున్నారు. కాగా, కనీసం నలభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తి వివరాలు, సమాచారం సేకరించి విశ్లేషించనున్నారని తెలుస్తోంది.
ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీచే ముప్పు ఏర్పడటంతో దిద్దుబాటు యో చనలో ఉన్నారంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవ ర్గాల్లో పార్టీ నాయకులు, శ్రేణులతో కూడా పూర్తిగా కలసిపోలేక పోయారని, వీరి మధ్య తేడాలు కొనసాగుతుండటం కూడా ఓ కారణంగా కనిపిస్తోందని అనుకుంటున్నా రు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు అధినేత ఎలాంటి చర్యలు చేపడతారోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment