బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా
ముంబై: రసవత్తరంగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను మాత్రం చేరుకోలేక పోయింది. ఈ సమయంలో గవర్నర్ నిర్ణయంపైనే ప్రస్తుత పరిస్థితి ఆధారపడి ఉన్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాను ‘బీజేపీ మనిషి’ అంటూ ట్విటర్‌లో మెసేజ్ పోస్టు చేశారు. దాంతో నెటిజన్లు ఈ ‘ధూమ్’ నటుడిని ‘బాలీవుడ్ రాహుల్ గాంధీ’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఉదయ్ చోప్రా ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడిన హంగ్ పరిస్థితులను ఉటంకిస్తూ, వజుభాయ్‌ను ఉద్ధేశిస్తూ తన ట్విటర్‌లో ఒక మెసేజ్ పోస్టు చేశారు. ‘ఇప్పుడే నేను గూగుల్‌లో కర్ణాటక గవర్నర్ గురించి వెతికాను. దానికి గూగుల్ అతన్ని బీజేపీ వ్యక్తి, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తిగా చూపిస్తుంది. దీన్ని బట్టి ఏం జరగబోతుందో మీకందరికి తెలుసనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ చేసి నెటిజన్లకు చిక్కాడు.
ఇంకేముందు నెటిజన్లు ఈ హీరోను తెగ ఆడుకుంటున్నారు. కొందరు ఉదయ్ చోప్రాను ‘బాలీవుడ్ రాహుల్‌గాంధీ’ అని, మరికొందరు ‘ఉదయ్ భాయ్ మీరు రాజకీయాల్లోకి రండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇంతకు విషయమేమిటంటే వజుభాయ్ వాలా బీజేపీ పార్టీకి చెందిన వాడని, ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఉదయ్ చోప్రా ఈ విషయాన్ని గూగుల్‌లో వెతికి మరీ చెప్పానని తన తెలివితక్కువతనాన్ని బయట పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment