రాజ్‌భవన్‌లో యడియూరప్పతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ వజూభాయ్‌వాలా
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక 32వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(76) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతో పాటు మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ, కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్ మురళీధరరావు, బీజేపీ నేత శోభాకరంద్లాజే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ఈ వేడుకకు వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు.
యెడ్డీకి అమిత్ షా ఫోన్..
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో బీజేపీ అధిష్టానం చకచకా పావులు కదిపింది. పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శుక్రవారం ఉదయాన్నే యడియూరప్పకు ఫోన్‌చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా అపాయింట్‌మెంట్ తీసుకున్న యడియూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనీ, సభలో మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ వజూభాయ్‌వాలా సాయంత్రం 6–6.15 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించారు. యడియూరప్ప ఇప్పటికే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మరోసారి ఎన్నుకోలేదు.
29న అసెంబ్లీలో బలపరీక్ష..
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక యడియూరప్ప స్పందిస్తూ.. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు బలపరీక్షను చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను సంప్రదించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు యడియూరప్ప విజ్ఞప్తి మేరకు సోమవారం సభను నిర్వహిస్తానని స్పీకర్ చెప్పారు.
యడ్యూరప్ప కాదు.. యడియూరప్ప!
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు. న్యుమరాలజీ ప్రభావంతో యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. 2007లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిరావడంతో న్యుమరాలజీ ప్రకారం యడియూరప్ప తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే ఇది కలిసిరాకపోవడంతో ఈ బీజేపీ నేత తన పాత పేరునే వాడాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమా?
ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుం టుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగు రిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ రమేశ్ మిగిలిన 14 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే/ అనర్హత వేటేస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 105 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇదే జరిగితే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గట్టెక్కుతుంది. అయితే 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం అస్పష్టత నెలకొంది.
ప్రజానుకూల పాలన అందిస్తాం: అమిత్ షా
కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైన, రైతు, ప్రజానుకూల పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్పకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కలహాలవల్లే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందనీ, తమ ప్రమేయం లేదన్నారు.
మండిపడ్డ కాంగ్రెస్, జేడీఎస్..
యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేయడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీకి అండగా నిలిచిన వజూభాయ్‌వాలా సాయంతో రాజ్యాంగ విరుద్ధంగా కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. అవినీతి రారాజు, జైలు పక్షి యడియూరప్ప రాజకీయ ప్రలోభాల విషయంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి అధికారంలోకి వచ్చారు’ అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. కర్ణాటక బీజేపీకి ప్రయోగశాలగా మారిపోయిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
యడియూరప్ప వరాల జల్లు
కర్ణాటకలో రైతులు, చేనేత కార్మికులకు సీఎం యడియూరప్ప వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎంపికైన రైతులకు అదనంగా రూ.4000ను రెండు విడతల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.100 కోట్ల మేర ఉన్న అప్పులను మాఫీ చేస్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ విషయంలో అన్నిపక్షాలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
15 ఏళ్లకే ఆరెస్సెస్ కార్యకర్త
కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తన స్వగ్రామం శికారిపురలో ఒక రైలు మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు.
తొలిసారి 2007లో..
2007 నవంబర్‌లో తొలిసారి యడియూరప్ప సీఎం అయ్యారు. జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు.
కొత్త పార్టీ.. మళ్లీ విలీనం
ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీ పెట్టారు. 2014లో కేజేపీని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ, దీనిపై కాంగ్రెస్, జేడీ(ఎస్) కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు వెంటనే బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. కేవలం 3 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్డీ మే 19న బలపరీక్షకు కాస్త ముందు రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment