బసవరాజు బొమ్మై
బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే.
జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment