గులాం నబీ ఆజాద్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక గవర్నర్ ఒకవేళ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆయన రాజకీయ ప్రలోభాలకు, బేరసారాలకు, అవినీతికి, పార్టీల ఫిరాయింపులకు బహిరంగంగా తెరతీసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన మెజారిటీ కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఉందని తెలిపారు. గవర్నర్ వజూభాయి వాలాతో మంగళవారం భేటీఅయిన తర్వాత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించరాదన్నారు.
ఏకైక అతిపెద్ద పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం కుదరదని గోవా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. చిన్నపార్టీల సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతు తమకు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీఎస్ గవర్నర్ వజూభాయి వాలాకు లేఖ రాసింది.
గవర్నర్‌కు మరో మార్గంలేదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ఆహ్వానించటం తప్ప గవర్నర్ వజూభాయి వాలాకు మరోమార్గం లేదని కాంగ్రెస్ పేర్కొంది. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తిప్పికొట్టారు. మొత్తం 222కు గాను 115 సభ్యుల బలమున్న ఈ కూటమికి ప్రభుత్వ ఏర్పాటులో అవకాశమివ్వటం రాజ్యాంగ, న్యాయసూత్రాల ప్రకారం సరైందేనన్నారు.
అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ అధికారం చేపట్టలేదన్నారు. 1998లో పార్లమెంట్‌లో సంఖ్యాపరంగా ఎక్కువ బలమున్న అటల్ బిహారీ వాజ్‌పేయి కూటమికే అప్పటి రాష్ట్రపతి నారాయణన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించి, మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment