
మహామస్తకాభిషేకానికి సిద్ధమైన బాహుబలి విగ్రహం. వేడుకలను ప్రారంభించిన కోవింద్ దంపతులు
సాక్షి, బెంగళూరు: శాంతి స్థాపనకు బాహుబలి (గోమఠేశ్వరుడు) ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పేర్కొన్నారు. అన్నింటి కంటే శాంతి ముఖ్యమని బోధించే జైనధర్మం ప్రపంచంలోనే ఎంతో విలువైందని కొనియాడారు. కర్ణాటకలో హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో కొలువుతీరిన గోమఠేశ్వరుని విగ్రహానికి 88వ మహామస్తకాభిషేక కార్యక్రమాలను కోవింద్ బుధవారం ప్రారంభించారు.
పన్నెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలను చావుండరాయ సభ మంటపంలో జ్యోతిని వెలిగించి నాంది పలికారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 17వ తేదీన మహామస్తకాభిషేకం జరుగనుంది. వేడుకల్లో రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, గవర్నర్ వజుభాయి వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తదితరులు పాల్గొన్నారు. 17 మీటర్ల ఎత్తైన బాహుబలి ఏకశిలా విగ్రహానికి జైన అర్చకులు పాలు, నెయ్యి, కుంకుమలతో అభిషేకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment