రేపే ‘విశ్వాసం’ పెట్టండి | Yeddyurappa Game For Karnataka Floor Test Challenge | Sakshi
Sakshi News home page

రేపే ‘విశ్వాసం’ పెట్టండి

Published Sun, Jul 14 2019 4:50 AM | Last Updated on Sun, Jul 14 2019 5:36 AM

Yeddyurappa Game For Karnataka Floor Test Challenge - Sakshi

శనివారం షిర్డి సన్నిధిలో కర్ణాటక రెబెల్‌ ఎమ్మెల్యేలు

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్‌ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం  తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు.

బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు.

స్పీకర్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ..
కాంగ్రెస్‌–జేడీఎస్‌ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్‌.నగేశ్, ఆర్‌.శంకర్‌ శనివారం స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్‌లో నగేశ్‌ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్‌ల మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు.

మా పిటిషన్లను కలిపి విచారించండి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్‌ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్‌ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్, కె.సుధాకర్, ఎన్‌.నాగరాజ్, మునిరత్న, రోషన్‌బేగ్‌లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్‌తో తమ పిటిషన్‌ను కలిపి విచారించాలని కోర్టును కోరారు.  10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్‌ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది.

అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్‌
కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్‌ ఎమ్మెల్యేలు రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్‌ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రమేశ్‌ కుమార్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఆపరేషన్‌ ‘నాగరాజ్‌’ సఫలం
ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్‌ ఎమ్మెల్యే  నాగరాజ్‌ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్‌ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్‌ మంత్రి శివకుమార్‌ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్‌ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్‌ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్‌ మీడియాతో మాట్లాడారు.

‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్‌గూండూరావులు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్‌తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్‌ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు.

ఫిరాయింపులపై చర్యలేవి? 
నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం

కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం.

స్పీకర్‌ పాత్రే కీలకం..
1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్‌ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్‌ పాత్రే కీలకం. స్పీకర్‌ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్‌ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు.


బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement