
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆందోళనకారుల నిరసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశం విడిచి మాల్దీవులకు పరారైన రాజపక్సకు అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. రాజపక్స మాల్దీవులకు చేరిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మళ్లీ సింగపూర్‌కు పయనమవుతున్నారు.
మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. అయితే సింగపూర్‌కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది.
చదవండి: రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం!
తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆందోళనలు ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపుతో మిన్నంటుతున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు.
కాగా గోటబయ తన భార్య ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో బుధవారం ఉదయమే మాల్దీవులకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు గోటబయ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్డుపైకి చేరుకొని కేరింతలు కొట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్‌లో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment