సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలందించేందుకు రెండు క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ.. విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్విసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్విస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
చెన్నై నుంచి సింగపూర్‌కి తొలి సర్విసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్.. ఈ క్రూయిజ్‌ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్విస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్‌ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతోపాటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్విసుల వివరాల్ని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది.
రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ సంయుక్తంగా విశాఖలో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. టెర్మినల్ అందుబాటులోకి రావడంతో.. క్రూయిజ్‌లో విహరించే వారికి సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్విస్‌ని విశాఖ మీదుగా నడపాలని భావించారు.
ముంబైలో ఇటీవల ముగిసిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)–2023లో లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తోపాటు చెన్నైకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ప్రతిని«ధులతో సంప్రదింపులు కూడా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాతో లిట్టోరల్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. చెన్నైని హోం పోర్ట్‌గా చేసుకుని రెండు విలాసవంతమైన నౌకలకు సంబంధించిన నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
భారత్–శ్రీలంక– మాల్దీవులకు మరో సర్విసు
రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్–శ్రీలంక–మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్విసును కూడా లిట్టోరల్ సంస్థ నడపనుంది. వీలైనంత త్వరగా ఈ సర్విసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు షిప్పులు పూర్తి లగ్జరీగా ఉంటాయని విశాఖపట్నం పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు.
ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్‌లో ఒకేసారి 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. దీంతో పాటు లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు చార్జీలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment