చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు.
అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది.
ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు.
నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.
రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు.
గతంలో యూఎన్‌పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్‌జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్‌పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్‌పీ) చెబుతోంది.
అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్‌ఎల్‌పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్‌పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే.
దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు.
కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్‌తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు.
2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే.
ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్‌పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్‌పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి.
లంకలో ఎన్నికల సందడి
Published Tue, Aug 20 2024 12:27 AM | Last Updated on Tue, Aug 20 2024 12:27 AM
Comments
Please login to add a commentAdd a comment