చైనా కొత్త ఎత్తులు | Sakshi Editorial On China | Sakshi
Sakshi News home page

చైనా కొత్త ఎత్తులు

Published Fri, Oct 27 2023 3:46 AM | Last Updated on Fri, Oct 27 2023 3:46 AM

Sakshi Editorial On China

ప్రపంచమంతా కొత్తగా రాజుకున్న ఇజ్రాయెల్‌ – గాజా లడాయిపై దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో చడీచప్పుడూ లేకుండా చైనా పావులు కదిపింది. మన సన్నిహిత దేశాలైన భూటాన్, శ్రీలంకలతో ఒప్పందాలు కుదుర్చుకుని మనల్ని ఇరకాటంలో పడేసింది. చైనాలో పర్యటించిన భూటాన్‌ విదేశాంగమంత్రి తాండీ దోర్జీతో చైనా ఉప విదేశాంగమంత్రి సన్‌ వీ డాంగ్‌ సంప్రదింపులు జరిపి ఇరుదేశాల సరిహద్దు వివాదాన్నీ పరిష్కరించుకోవటానికి ఉమ్మడి సాంకేతిక నిపుణుల బృందం ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నారు. రెండు దేశాల మధ్యా దౌత్యసంబంధాలు ఏర్పాటుచేసు కోవాలని కూడా నిర్ణయించుకున్నారు.

అటు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే కూడా చైనా సందర్శించి ఆ దేశం తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ)లో తమ దేశం పాలుపంచుకుంటుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై త్వరలో సంతకాలవుతాయని సంయుక్త ప్రకటనలో తెలిపారు. భూటాన్, శ్రీలంక రెండూ సార్వభౌమాధి కారం వున్న దేశాలు. తమ ప్రయోజనాలకు తగినట్టు అవి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ ఒప్పందాల పర్యవసానాలు భారత్‌ భద్రతతో ముడిపడివుండటం మనల్ని కలవరపరిచే అంశం. 

శ్రీలంక మాటెలావున్నా భూటాన్‌తో మనకు ప్రత్యేక అనుబంధం వుంది. 2007 వరకూ భూటాన్‌తో వున్న స్నేహ ఒడంబడిక ప్రకారం మన దేశం ఆమోదించిన 21 దేశాలతో మాత్రమే అది దౌత్య సంబంధాలు ఏర్పర్చుకునేది. యూపీఏ హయాంలో ఈ ఒప్పందం గడువు ముగిసినా మన దేశం చొరవ తీసుకోకపోవటం, ఈలోగా ఆ ఒప్పందం కింద భూటాన్‌కి అప్పటివరకూ ఇచ్చే సబ్సిడీలు ఆగిపోవటం సమస్యలకు దారితీసింది. ఆ దేశంలో ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోయాయి. వాస్తవానికి భూటాన్‌ ఉత్తర సరిహద్దులో వున్న చంబీలోయ ప్రాంతాన్ని తమకు ధారాదత్తం చేయమని చైనా కోరినా అది భారత్‌ భద్రతకు సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఏకైక కారణంతో భూటాన్‌ తిరస్కరించింది.

2005లో భూటాన్‌ రాజు ఐచ్ఛికంగా రాచరిక ఆధిప త్యాన్ని వదులుకుని రాజ్యాంగబద్ధ పాలనకు బాటలు పరిచారు. అటు తర్వాత నుంచి భూటాన్‌ ఆలోచన మారింది. దేశానికి గరిష్ఠంగా మేలు చేసే విదేశాంగ విధానం అనుసరించాలన్న అభి ప్రాయం బలపడింది. అలాగని 2017లో డోక్లామ్‌లో చైనాతో వివాదం తలెత్తినప్పుడు భూటాన్‌ మన సాయమే తీసుకుంది. అయితే మన దేశం మరింత సాన్నిహిత్యంగా మెలిగివుంటే అది చైనా వైపు చూసేది కాదు. డోక్లామ్‌కు దగ్గరలో చైనా భూగర్భ గిడ్డంగుల్ని నిర్మిస్తోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ మన దేశాన్ని నిరుడు హెచ్చరించింది.

అలాగే అక్కడికి సమీపంలో ఒకటి రెండు గ్రామాలను సృష్టించి ప్రజలను తరలించిందన్న వార్తలొచ్చాయి. డోక్లామ్‌ ప్రాంతం భారత్‌– భూటాన్‌– చైనా సరిహద్దుల కూడలి. అలాంటిచోట చైనా రోడ్డు నిర్మాణానికి పూనుకోవటం వల్ల 2017లో వివాదం తలెత్తింది. మన దేశం గట్టిగా అభ్యంతరాలు తెలపటంతో చైనా వెనక్కు తగ్గింది. కానీ ఆనాటి నుంచీ భూటాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు అది చేస్తూనేవుంది. ఒకపక్క మనతో వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ వివాదాల పరిష్కారానికి ఏ మాత్రం సిద్ధపడకుండా, చర్చల పేరుతో కాలయాపన భూటాన్‌తో మాత్రం సన్నిహితం కావటానికి చైనా ప్రయత్నించటంలోని ఉద్దేశాలు గ్రహించటం పెద్ద కష్టం కాదు. 

ఇటు శ్రీలంక సైతం మన అభ్యంతరాలను బేఖాతరు చేసి బీఆర్‌ఐ ప్రాజెక్టులో పాలుపంచు కునేందుకే నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మనల్ని దెబ్బతీసేందుకు మనకు సన్నిహితంగా వుండే దేశాలను రుణాలతో, భారీ ప్రాజెక్టులతో తనవైపు తిప్పుకునే చైనా ప్రయ త్నాలు ఈనాటివి కాదు. భారీ నౌకాశ్రయాలు, రహదారులు, విమానాశ్రయాలు నిర్మించేందుకు తమ ఎగ్జిమ్‌ బ్యాంకు ద్వారా చైనా అందించిన రుణాలు లంకను కుంగదీశాయి.

విదేశీ మారకద్రవ్యం నిల్వలు చూస్తుండగానే అడుగంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గుల్లయింది. ధరలు పెరిగిపోవటం, నిత్యావసరాల కొరత ఏర్పడటం పర్యవసానంగా నిరుడు తీవ్ర నిరసనలు పెల్లుబికి రాజపక్స సోద రులు, వారి కుటుంబసభ్యులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మన దేశం శ్రీలంకకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. బీఆర్‌ఐ ప్రాజెక్టుకు అంగీకరించి, చైనా ఇస్తున్న రుణాలకు ఆమోదముద్ర వేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని ఈనెల 11న కొలంబోలో జరిగిన హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సు సందర్భంగా మన విదేశాంగమంత్రి జైశంకర్‌ హెచ్చరించారు. 

నిరుడు దేశంలో సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర 20 దేశాలున్న పారిస్‌ క్లబ్‌తో పాటు మన దేశం కూడా శ్రీలంకకు ఒక షరతు పెట్టింది. రుణాల చెల్లింపులో ఒకే విధమైన నిబంధనలు అనుసరించాలని, ద్వైపాక్షిక ఒప్పందం పేరుతో ఎవరికీ వెసులు బాటు ఇవ్వరాదని  తెలిపాయి. అయినా చైనా విషయంలో అందుకు భిన్నమైన మార్గాన్ని శ్రీలంక ఎంచుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం జాగ్రత్తగా అడుగులేయాలి. మన వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకొనరాదని శ్రీలంక, భూటాన్‌లకు నచ్చజెప్పాలి. ఏ కారణాలు వారిని చైనా వైపు మొగ్గు చూపేందుకు దారితీస్తున్నాయో గ్రహించి మనవైపు ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాలి. సకాలంలో సరైన కార్యాచరణకు పూనుకుంటే మనకు సానుకూల వాతావరణం ఏర్పడటం పెద్ద కష్టం కాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement