సంక్షోభ లంకపై నెలవంక! | Sakshi Editorial On President of Sri Lanka Anura Kumara Dissanayake | Sakshi
Sakshi News home page

సంక్షోభ లంకపై నెలవంక!

Published Tue, Sep 24 2024 5:00 AM | Last Updated on Tue, Sep 24 2024 11:03 AM

Sakshi Editorial On President of Sri Lanka Anura Kumara Dissanayake

దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 

2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. 

గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష  జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్‌పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. 

దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. 

అందుకే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్‌ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్‌ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.

అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. 

తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్‌ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.

చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. 

అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్‌ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్‌ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. 

పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్‌ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement