President of Sri Lanka
-
సంక్షోభ లంకపై నెలవంక!
దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. -
Sarath Fonseka: శ్రీలంక అధ్యక్ష బరిలో మాజీ ఆర్మీ చీఫ్
కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా(73) ప్రకటించారు. అధ్యక్షుడైతే అవినీతిని రూపుమాపి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17–అక్టోబర్ 16 తేదీల మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సె సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఎలీ్టటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురా కుమార దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో విక్రమ సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా.. అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. కాగా, మొత్తం పోలైన ఓట్లు 219. ఇదిలా ఉండగా.. రణిల్ విక్రమసింఘే ఇప్పటి వరకు లంక ప్రధానిగా ఆరుసార్లు పనిచేశారు. ఇక, అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విక్రమసింఘే మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు. Ranil Wickremesinghe elected as the new President of Sri Lanka: Reuters pic.twitter.com/WGjaLPY0zj — ANI (@ANI) July 20, 2022 -
ప్రధానిగా మహింద ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శతాబ్దాల చరిత్ర ఉన్న బౌద్ధాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయ రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ ప్రముఖులు, దౌత్యాధికారులు, సీనియర్ అధికారులు పొల్గొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్ఎల్పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటు రాజపక్స కుటుంబం హవా సాగనుంది. కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయం రాజమహ విహారయలో ఆదివారం ఉదయం 9.28 గంటలకు జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధికార ఎస్ఎల్పీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, పండుగ చేసుకున్నారు. ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం ఖాయమన్న సంకేతాలు వెలువడగానే భారత ప్రధాని మోదీ రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 225కు గాను.. 150 సీట్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్ఎల్పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది. 24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి.. మహింద రాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి. -
తిరుమలలో రాజపక్స
అడుగడుగునా గట్టి బందోబస్తు తమిళ పార్టీల కార్యకర్తల నిరసన ఎక్కడికక్కడ నిలువరించిన పోలీసులు సుప్రభాత సేవలో శ్రీలంక అధ్యక్షుడు సుప్రభాతం బుకింగ్, అంగ ప్రదక్షిణం రద్దు సాక్షి, తిరుమల: శ్రీ లంక అధ్యక్షుడు మహీంద రాజపక్స మంగళవారం తిరుమలకు వచ్చారు. తన కుమారుల్లో ఇద్దరు హోహితా రాజపక్స, రోహితా రాజపక్సతో కలసి సాయంత్రం 5.35 గంటలకు ఆయన తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తిరుమల పద్మావతి అతిథిగృహంలో రాజపక్స కుటుంబ సభ్యులు బస చేశారు. బుధవారం వేకువజామున 2.30 గంటలకు సుప్రభాత సేవలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సమయంలో భద్రతా కారణాల రీత్యా టీటీడీ అంగ ప్రదక్షిణం రద్దు చేసింది. తిరుమలలోని విజయబ్యాంకులో కరెంట్ బుకింగ్‌లో ఇచ్చే సుప్రభాత సేవా టికెట్లను కూడా రద్దు చేశారు. ఈ టికెట్లను రాజ్యాంగ పరిధిలోకి వచ్చేవారికి మాత్రమే కేటాయించారు. త్వరలో శ్రీ లంకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకునేందుకు రాజపక్స వచ్చారని అధికారులు తెలిపారు. మిన్నంటిన నిరసనలు: రాజపక్స పర్యటన తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమిళనాడు నుంచి 500 మంది ఎండీఎంకే, వీసీకే పార్టీల కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందోబస్తుతో రెండ్రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.