తన అన్న మహింద నుంచి ఆశీస్సులు అందుకుంటున్న అధ్యక్షుడు గొతబయ
కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శతాబ్దాల చరిత్ర ఉన్న బౌద్ధాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయ రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ ప్రముఖులు, దౌత్యాధికారులు, సీనియర్ అధికారులు పొల్గొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటు రాజపక్స కుటుంబం హవా సాగనుంది. కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయం రాజమహ విహారయలో ఆదివారం ఉదయం 9.28 గంటలకు జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధికార ఎస్‌ఎల్‌పీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, పండుగ చేసుకున్నారు. ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం ఖాయమన్న సంకేతాలు వెలువడగానే భారత ప్రధాని మోదీ రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
225కు గాను.. 150 సీట్లు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్‌ఎల్‌పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్‌తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది.
24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి..
మహింద రాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment