Sri Lankan President Rajapaksa
-
లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే!
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆందోళనకారుల నిరసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశం విడిచి మాల్దీవులకు పరారైన రాజపక్సకు అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. రాజపక్స మాల్దీవులకు చేరిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మళ్లీ సింగపూర్‌కు పయనమవుతున్నారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. అయితే సింగపూర్‌కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చదవండి: రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం! తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆందోళనలు ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపుతో మిన్నంటుతున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. కాగా గోటబయ తన భార్య ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో బుధవారం ఉదయమే మాల్దీవులకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు గోటబయ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్డుపైకి చేరుకొని కేరింతలు కొట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. -
శ్రీలంక టు ఢిల్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకోవాల్సిన ఐదుగురు జాలర్ల ప్రయాణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఉరి విముక్తికి విశేష కృషి చేసిన ప్రధాని నరేంద్రమోదీకి నేరుగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు గురువారం రాత్రి వారంతా ఢిల్లీకి చేరుకున్నారు. హెరాయిన్ అక్రమ రవాణా కేసులో శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు ఉరి శిక్ష విధించింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో చర్చిం చారు. మోదీ దౌత్యం ఫలించగా ఐదుగురు జాలర్ల ఉరిశిక్ష రద్దయి శ్రీలంక జైలు నుంచి బుధవారం విడుదలయ్యూ రు. ఈనెల 19న శ్రీలంక జైలు నుంచి విముక్తి పొందిన జాలర్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు అక్కడి భారత రాయబార కార్యాలయానికి చేర్చారు. అక్కడి నుంచి తమిళనాడులోని తమ కుటుంబాల వారితో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. కొన్నేళ్ల తరువాత తమ వారి గొంతు వినపడడంతో ఇరువైపులవారు ఆనందభాష్పాల్లో మునిగితేలారు. గురువారం సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటామని వారు తమవారికి చెప్పుకున్నారు. ఐదుగురి జాలర్ల స్వస్థలమైన రామనాధపురం తంగచ్చి మండపానికి చెందిన వందలాది కుటుంబాలు, జాలర్ల సంఘాలు గురువారం ఉదయాన్నే తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి. జాలర్లకు ఘన స్వాగత ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఐదుగురు జాలర్లను గురువారం ఉదయం విమానం ద్వారా తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చేర్చాలని శ్రీలంక భావించింది. అయితే ఉదయం విమానంలో సీట్లు ఖాళీ లేకపోవడంతో మధ్యాహ్నం 2.30 గంటల విమానంలో పంపేలా మార్పుచేశారు. జాలర్ల విడుదలకు కృషి చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలపాలని జాలర్ల సంఘాలు, కుటుంబాల వారు భావించడంతో వారి ప్రయాణం ఢిల్లీకి మారింది. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలోని జాలర్ల కుటుంబాల వారు నిరాశతో వెనుదిరిగిపోయారు. ప్రధాని మోదీని కలుసుకున్న తరువాత శుక్రవారం సాయంత్రంలోగా ఐదుగురు జాలర్లు తమ ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది. మోదీపై ప్రశంసల జల్లు తమిళనాడు జాలర్లను ఉరిశిక్ష నుంచి కాపాడిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంశలు జల్లుకురిసింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు ఇది పూర్తిగా మోదీ ఘనతగా అభివర్ణించారు. తమవారికి ప్రధాని మోదీ పూర్ణాయుష్షుతోపాటూ కొత్త జీవితాన్ని ప్రసాదించారని ఆ జాలర్ల కుటుంబాల వారు పేర్కొన్నారు. -
భారీ బడ్జెట్‌తో కత్తి
ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కత్తి. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. తుపాకీ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఐన్గరన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని నిర్మాతలు తెలిపారు. ఫిబ్రవరి 3న కోల్‌కతాలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించి హైదరాబాద్, రాజమండ్రి, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించినట్లు వివరించారు. ఈ నెల ఏడో తేదీ నుంచి చెన్నైలో వేసిన భారీ సెట్లో షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ 40 రోజులపాటు జరుగుతుందని తెలిపారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన కరుణామూర్తి చెప్పారు. చిత్రానికి అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్నారు. శ్రీలంకతో సంబంధాల్లేవు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ఎలాంటి సంబంధాల్లేవని కత్తి చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ సంస్థల అధినేతలకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో స్నేహ, వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరగడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఐయిన్గరన్ సంస్థ అధినేత కరుణామూర్తి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లైకా ప్రొడక్షన్ అధినేత సుభాష్కరన్, తాను 30 ఏళ్ల క్రితమే శ్రీలంకను వదిలి వచ్చేశామన్నారు. తాను 27 ఏళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నానని చెప్పారు. లైకా సుభాష్కరన్ శ్రీలంకలోని ముల్లై దీవికి చెందిన తమిళుడని చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఏడాదికి టర్నోవర్ 15 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ పదేళ్లుగా చెన్నైలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. 1800 మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. లైకా సుభాష్కరన్-2013 మేలో తన జన్మభూమిని సందర్శించడానికి శ్రీలంక వచ్చారని ఆయనతోపాటు తాను ఉన్నానని తెలిపారు. రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని ముల్లై దీవి పరిసర ప్రాంతాలను చుట్టొచ్చామని చెప్పారు. దీంతో కొందరు రాజపక్సేతో స్నేహ సంబంధాలంటూ అసత్య ప్రచారం చేశారని వివరించారు.