చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకోవాల్సిన ఐదుగురు జాలర్ల ప్రయాణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఉరి విముక్తికి విశేష కృషి చేసిన ప్రధాని నరేంద్రమోదీకి నేరుగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు గురువారం రాత్రి వారంతా ఢిల్లీకి చేరుకున్నారు. హెరాయిన్ అక్రమ రవాణా కేసులో శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు ఉరి శిక్ష విధించింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో చర్చిం చారు. మోదీ దౌత్యం ఫలించగా ఐదుగురు జాలర్ల ఉరిశిక్ష రద్దయి శ్రీలంక జైలు నుంచి బుధవారం విడుదలయ్యూ రు. ఈనెల 19న శ్రీలంక జైలు నుంచి విముక్తి పొందిన జాలర్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు అక్కడి భారత రాయబార కార్యాలయానికి చేర్చారు.
అక్కడి నుంచి తమిళనాడులోని తమ కుటుంబాల వారితో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. కొన్నేళ్ల తరువాత తమ వారి గొంతు వినపడడంతో ఇరువైపులవారు ఆనందభాష్పాల్లో మునిగితేలారు. గురువారం సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటామని వారు తమవారికి చెప్పుకున్నారు. ఐదుగురి జాలర్ల స్వస్థలమైన రామనాధపురం తంగచ్చి మండపానికి చెందిన వందలాది కుటుంబాలు, జాలర్ల సంఘాలు గురువారం ఉదయాన్నే తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి.
జాలర్లకు ఘన స్వాగత ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఐదుగురు జాలర్లను గురువారం ఉదయం విమానం ద్వారా తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చేర్చాలని శ్రీలంక భావించింది. అయితే ఉదయం విమానంలో సీట్లు ఖాళీ లేకపోవడంతో మధ్యాహ్నం 2.30 గంటల విమానంలో పంపేలా మార్పుచేశారు. జాలర్ల విడుదలకు కృషి చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలపాలని జాలర్ల సంఘాలు, కుటుంబాల వారు భావించడంతో వారి ప్రయాణం ఢిల్లీకి మారింది. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలోని జాలర్ల కుటుంబాల వారు నిరాశతో వెనుదిరిగిపోయారు. ప్రధాని మోదీని కలుసుకున్న తరువాత శుక్రవారం సాయంత్రంలోగా ఐదుగురు జాలర్లు తమ ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది.
మోదీపై ప్రశంసల జల్లు
తమిళనాడు జాలర్లను ఉరిశిక్ష నుంచి కాపాడిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంశలు జల్లుకురిసింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు ఇది పూర్తిగా మోదీ ఘనతగా అభివర్ణించారు. తమవారికి ప్రధాని మోదీ పూర్ణాయుష్షుతోపాటూ కొత్త జీవితాన్ని ప్రసాదించారని ఆ జాలర్ల కుటుంబాల వారు పేర్కొన్నారు.
శ్రీలంక టు ఢిల్లీ
Published Fri, Nov 21 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement
Advertisement