శ్రీలంక దాష్టీకం | Sri Lanka denies involvement of navy in fishermen's shooting | Sakshi
Sakshi News home page

శ్రీలంక దాష్టీకం

Published Wed, Mar 8 2017 3:06 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

శ్రీలంక దాష్టీకం - Sakshi

శ్రీలంక దాష్టీకం

♦ తుపాకీ కాల్పులకు తమిళజాలరి బలి
♦ మత్స్యకార గ్రామాల్లో ఆందోళన
♦ గత 35 ఏళ్లలో 200లకు పైగా కాల్పులకు బలి


తమిళజాలర్లపై తరచూ దాడులకు పాల్పడే శ్రీలంక దాష్టీకం పరాకాష్టకు చేరుకుంది. తుపాకీతో కాల్పులు జరిపి ప్రిట్సో అనే జాలరి నిండు ప్రాణాన్ని హరించి వేసింది. జాలరి హత్యతో మత్స్యకార గ్రామాలు శోకసంద్రమయ్యాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై:  పాకిస్థాన్  జలసంధి సముద్ర పరిధిలో చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై దాడులకు దిగడం శ్రీలంక సముద్రతీర గస్తీదళాలకు పరిపాటిగా మారింది. తమిళ జాలర్లను నడిసముద్రంలోనే వేధించడం, వారివద్దనున్న వలలను చింపివేయడం, అప్పటి వరకు వేటాటిన చేపలను సముద్రంలో వదిలివేయడం వంటి చేష్టలు శ్రీలంక దళాలకు నిత్యకృత్యాలు. అంతేగాక అడపదడపా జాలర్లను అరెస్ట్‌ చేసి శ్రీలంక జైళ్లలో నెట్టి పడవలను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు అందజేసిన వివరాల ప్రకారం 1983 నుండి 2010 వరకు 212 మందిపై కాల్పులు జరిపి చంపివేసింది. 1991–2011 మధ్యకాలంలో 85 మంది కాల్పులకు హతమైనారు.

1983 నుంచి 2011 వరకు 167 సార్లు కాల్పులు జరపగా 180 మంది జాలర్లు తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు నెలల కాలంలో రామేశ్వరం, పుదుక్కోట్టై ప్రాంతాలకు చెందిన 85 మది జాలర్లను శ్రీలంక దళాలు అరెస్ట్‌ చేశాయి. ఇదిలా ఉండగా, రామేశ్వరానికి చెందిన సుమారు 416 పడవల్లో 2500 మంది జాలర్లు మంగళవారం చేపలవేటకని సముద్రంలోకి వెళ్లారు. వీరిలో కొందరు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ధనుష్కోటి–కచ్చదీవుల మధ్యలో  చేపలవేట సాగిస్తుండగా కన్ పోట్‌ నౌక, వాటర్‌ స్కూటర్లలో శ్రీలంక దళాలు చుట్టుముట్టాయి.

తమిళజాలర్లు తేరుకునేలోగా వారిపై విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాయి. భయభ్రాంతులకు గురైన జాలర్లు మరపడవల్లోని అడుగుభాగానికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే టిట్టో అనే వ్యక్తికి చెందిన పడవలోని ప్రిట్సో (21) గొంతులోకి, పడవను నడుపుతున్న సరోన్  (22) చేతి మణికట్టులోకి బుల్లెట్లు చొచ్చుకుపోయాయి. కాల్పుల తరువాత శ్రీలంక దళాలు వెళ్లిపోయాయి. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రిట్సోను ఆసుపత్రిలో చేర్చేందుకు ఒడ్డుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

కాల్పుల సమాచారం అందడంతో పోలీస్, విజిలెన్స్  , రెవెన్యూ అధికారులతోపాటూ రామేశ్వరం, తంగసిమిడం ప్రాంతాల నుంచి వందలాది మంది మత్స్యకారులు ఆందోళనగా అర్దరాత్రే సముద్రతీరానికి చేరుకున్నారు. అర్దరాత్రి 12.15 గంటలకు ప్రిట్సో మృతదేహాన్ని తీసుకుని జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే గాయపడిన సరోన్ ను రామేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం నుండి ఏకే 47 తుపాకీ బుల్లెట్‌ను బైటకు తీసారు. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాధితుల ఆందోళ : ప్రిట్సో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి బు«ధవారం ఉదయం 8.30 గంటలకు తల్లిదండ్రులకు అప్పగించేందుకు అధికారులు ప్రయతించగా మృతుని తల్లిదండ్రులు హెర్ట్‌బట్‌ మేరీ, కొంబల్స్‌ తదితరులు నిరాకరించారు. జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేవరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని మత్స్యకారులు పట్టుపట్టారు. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా అధికారులు వేలాది మంది పోలీసులను మొహరింపజేశారు.

రామేశ్వరం జిల్లా కలెక్టర్‌ నటరాజన్, ఎస్పీ మణివణ్ణన్  ఇతర అధికారులు జాలర్ల సంఘ నేతలతో మూడుసార్లు జరిపిన చర్చలు విఫలమైనాయి. బాధిత కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. జాలర్ల ఇబ్బందులపై ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్  తీవ్రంగా ఖండిచారు. అన్నాడీఎంకేకు చెందిన లోక్‌సభ ఉపసభపతి తంబిదురై, ఎంపీ వేణుగోపాల్‌ ఈ సంఘటనపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు.

కాల్పులు జరపలేదు:  శ్రీలంక
ఇదిలా ఉండగా, తమిళ జాలర్లపై జరిగిన కాల్పులకు తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని శ్రీలంక సుముద్రతీర గస్తీదళాల ప్రధాన కార్యాలయ పౌర సంబంధాల అధికారి, కెప్టెన్  సమింద వలకుకే బుధవారం ప్రకటించారు. శ్రీలంక కాల్పుల్లో జాలరి మృతి చెందినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తమిళ జాలర్లపై కాల్పులు జరపాల్సిందిగా తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదని, హద్దులు దాటితే అరెస్ట్‌ చేయాలని మాత్రమే ఆదేశించామని  ఆయన స్పష్టం చేశారు. జాలరిపై జరిగిన కాల్పులను కేంద్ర మంత్రి పొన్  రాధాకృష్ణన్  ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement