భారీ బడ్జెట్‌తో కత్తి
ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కత్తి. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. తుపాకీ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఐన్‌గరన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని నిర్మాతలు తెలిపారు.
ఫిబ్రవరి 3న కోల్‌కతాలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించి హైదరాబాద్, రాజమండ్రి, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించినట్లు వివరించారు. ఈ నెల ఏడో తేదీ నుంచి చెన్నైలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ 40 రోజులపాటు జరుగుతుందని తెలిపారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన కరుణామూర్తి చెప్పారు. చిత్రానికి అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్నారు.
శ్రీలంకతో సంబంధాల్లేవు
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ఎలాంటి సంబంధాల్లేవని కత్తి చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ సంస్థల అధినేతలకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో స్నేహ, వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరగడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఐయిన్‌గరన్ సంస్థ అధినేత కరుణామూర్తి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లైకా ప్రొడక్షన్ అధినేత సుభాష్‌కరన్, తాను 30 ఏళ్ల క్రితమే శ్రీలంకను వదిలి వచ్చేశామన్నారు.
తాను 27 ఏళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నానని చెప్పారు. లైకా సుభాష్‌కరన్ శ్రీలంకలోని ముల్లై దీవికి చెందిన తమిళుడని చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఏడాదికి టర్నోవర్ 15 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ పదేళ్లుగా చెన్నైలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. 1800 మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. లైకా సుభాష్‌కరన్-2013 మేలో తన జన్మభూమిని సందర్శించడానికి శ్రీలంక వచ్చారని ఆయనతోపాటు తాను ఉన్నానని తెలిపారు.
రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని ముల్లై దీవి పరిసర ప్రాంతాలను చుట్టొచ్చామని చెప్పారు. దీంతో కొందరు రాజపక్సేతో స్నేహ సంబంధాలంటూ అసత్య ప్రచారం చేశారని వివరించారు.