డ్రైవర్ కోసం దేశాధినేత నిరీక్షణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు పది నిమిషాలపాటు కారులోనే డ్రైవర్‌కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో అంతా నిర్ఘాంతపోయారు. ఒక దేశాధ్యక్షుడు ఇలా నిరీక్షించడమా అని ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందంటే.. పోలీసు విభాగం అనుమతి లేకుండానే అధ్యక్షుడి వాహన డ్రైవర్‌ను బయోమెట్రిక్ ద్వారం నుండి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనం త్వరగా కల్పించి డ్రైవర్‌ను ఆలయం వెలుపలకు పంపి ఉంటే సమస్య ఉండేది కాదు? డ్రైవర్ క్యూలో చిక్కుకున్నాడు. తర్వాత డ్రైవరు ఆదరాబాదరాగా వాహనం వద్దకు చేరుకున్నాడు. దీనివల్ల సిరిసేనపదినిమిషాలపాటు కారులోనే నిరీక్షించాల్సి వచ్చింది.
వీఐపీల దర్శనం విషయంలో ఆలయ అధికారులు ముందుగానే పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుని ఉంటే పరిస్థితి బాగుండేది. ముందస్తు సమచారం లేకపోవడం, తీసుకెళ్లిన డ్రైవర్‌ను ఆలయంలోనే వదిలేయటం వంటివి చేయటం వల్లే డ్రైవర్ క్యూలో చిక్కుకున్నాడు. ఇలాంటి సంఘటన తిరుమల చరిత్రలోనే ఇది తొలిసారి. ఆలయ, పోలీసు విభాగాల సమన్వయ తప్పిదం అయినప్పటికీ, దాని ప్రభావం మనదేశ ప్రతిష్ట , పరిపాలన వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు. ఇలాంటి తప్పిదాలను ఆ దేశ విదేశాంగ విభాగం తీవ్రంగా పరిగణిస్తుంది.
దేశాధ్యక్షుడి పర్యటన ముగిశాక ఆ దేశ విదేశాంగ విభాగం వివరణ అడిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ తప్పిందంపై అర్బన్‌జిల్లా ఎస్‌పి జయలక్ష్మి ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావుపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా డ్రైవర్‌ను శ్రీవారి దర్శనానికి ఎలా తీసుకెళతారు? తీసుకెళ్లిన డ్రైవర్‌ను ఎలా వదిలేస్తారు? దీనికి బాధ్యులెవరు? అంటూ మండిపడ్డారు. ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావు మాత్రం పెద్దగా స్పందించకపోవడం విస్మయం కలిగించింది. సాధారణంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల సందర్శనకు ముందు సంబంధిత విభాగాలన్నీ ప్రతి చిన్న సమన్వయపర్చుకోవాలి. ముందస్తు కసరత్తు లేకపోవడం వల్లే ఈ పొరపాటు తలెత్తినట్లు సమాచారం.