భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు. ఆపరేషన్ సర్జికల్ అనంతరం సింఘే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సార్క్ సమ్మిట్ ఈనెలలో పాకిస్థాన్ లో జరుగనుంది. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ లు భారత్ కు మద్దతుగా సార్క్ కు హాజరుకారాదని నిర్ణయించుకున్నాయి. భారత్ ప్రాతినిథ్యం లేకుండా సార్క్ సమావేశం సాధ్యం కాదని విక్రమ సింఘే పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా విక్రమ సింఘే సమావేశమవనున్నారు. ఆయన గురువారం ఇండియన్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం కొలంబోకు పయనమవుతారు.