
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితంగా తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ వృద్ధిపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. రాష్ట్ర ప్రగతికి, గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మల్లాంటి చిన్ననీటి వనరుల అభివృద్ధి ఇతర దేశాలకు ఆదర్శనీయంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో మూడేళ్లకోసారి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) నిర్వహించే సదస్సు ఈసారి ఇండోనేసియాలోని బాలిలో జరగగా, ఈ సదస్సుల్లో మిషన్ కాకతీయపై కీలక పత్రాలను సమర్పించే అవకాశం తెలంగాణకు దక్కింది. దీంతోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో నీటి వినియోగ సామర్థ్యం అంశాలపై పత్రాలు సమర్పించగా, వీటిపై చీఫ్ ఇంజనీర్లు హమీద్ ఖాన్, శంకర్, నర్సింహ, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరై రాష్ట్రం తీసుకున్న జల సంరక్షణ చర్యలపై మాట్లాడారు.
రాష్ట్రంలోని సుమారు 40 వేలకు పైగా ఉన్న చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, ఆ మట్టిని పొలాలకు తరలింపు, నీటి సామర్థ్యం పెంపు చర్యలు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి ద్వారా నీటి సంరక్షణ తదితర అంశాలపై శ్రీధర్ దేశ్‌పాండే వివరించారు. చెరువుల పునరుద్ధరణతో ప్రస్తుతం 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపారు. దీనిపై ఐసీఐడీ సదస్సు ప్రశంసలు కురిపించింది. ఇక సాగర్, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీటి వినియోగం, నీటి సరఫరాలో వ్యత్యాసాల తగ్గింపు, నీటి వృ«థాకు అడ్డుకట్ట ఎలా జరిగిందన్న అంశాలపై నరసింహ, శంకర్‌లు ఈ సదస్సులో వివరించారు.