ఉప్పొంగిన పాతాళగంగ | mission kakatiya and irrigation projects in telangana | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన పాతాళగంగ

Published Mon, Nov 7 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

ఉప్పొంగిన పాతాళగంగ

ఉప్పొంగిన పాతాళగంగ

రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు
సగటున 8.69 మీటర్ల పెరుగుదల
‘కాకతీయ’ పరిధిలో 9.68 మీటర్లు
భూమిలోకి ఇంకిన 430 టీఎంసీల నీరు..
   గత 15 ఏళ్లలో ఇదే రికార్డు అంటున్న అధికారులు
గతేడాది అక్టోబర్‌లో
    11.27 మీటర్ల లోతులో జలం
ఇప్పుడు 7.11 మీటర్లలోనే లభ్యత

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రంలో పాతాళగంగ పైపైకి వస్తోంది. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టాల్లో గణనీయ వృద్ధి కనిపిస్తోంది. రిజర్వాయర్లు, మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల భూగర్భ జలమట్టాల్లో అనూహ్య పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో సగటున 8.69 మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరగ్గా.. మిషన్‌ కాకతీయ చెరువుల కింద ఏకంగా 9.68 మీటర్ల మేర పెరుగుదల ఉన్నట్లు భూగర్భ జల విభాగం తేల్చింది. రాష్ట్రంలో పరీవాహక ప్రాంతం, పెరిగిన నీటిమట్టాల ఆధారంగా చూస్తే భూగర్భంలోకి సుమారు 430 టీఎంసీల నీరు చేరిందని, గత పదిహేనేళ్లలో ఇదే రికార్డని తెలిపింది.

కలిసొచ్చిన ‘కాకతీయ’
రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన వర్షాలు, వాటితో పెరిగిన భూగర్భ జలాలు, మిషన్‌ కాకతీయ చెరువుల కింద పరిస్థితిపై భూగర్భ జల విభాగం అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గతేడాదితో పోలిస్తే 4.16 మీటర్ల మేర భూగర్భ మట్టం పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 11.27 మీటర్ల లోతున నీరు ఉండగా ప్రస్తుతం 7.11 మీటర్ల లోతులోనే ఉంది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే భూగర్భ జల మట్టాల్లో వృద్ధి ఏకంగా 8.69 మీటర్లుగా నమోదైంది. మెదక్, నిజామాబాద్‌ జిల్లాలో ఏకంగా 10 మీటర్ల మేర భూగర్భ నీటి మట్టాలు పెరగ్గా.. కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో 5 మీటర్లకు పైనే పెరిగాయి. ఇక మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పరిధిలో భూగర్భ మట్టాలపై విడిగా అధ్యయనం చేయగా... అనూహ్య ఫలితాలు కనిపించాయి. 9 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన చెరువుల పరిధిలో అధ్యయనం చేయగా భూగర్భ జలాలు సగటున 9.68 మీటర్లు పెరిగాయి. సిద్దిపేట చెరువు కింద ఏకంగా 15.52 మీటర్ల మట్టం పెరగ్గా, నిజామాబాద్‌ జిల్లా చేపూర్‌లో 12.50 మీటర్లు, నల్లగొండ జిల్లా బి.వెల్లెంలలో 10.88 మీటర్ల మేర పెరిగినట్లు భూగర్భ జల విభాగం పేర్కొంది.

రికార్డు స్థాయిలో ఇంకిన నీళ్లు
గడచిన పదిహేనేళ్ల భూగర్భ మట్టాలు, భూగర్భంలోకి చేరిన నీటిపైనా అధికారులు అధ్యయనం చేశారు. గత పదిహేనేళ్లలో కేవలం మూడు సంవత్సరాల్లో (2001, 2003, 2008) మాత్రమే భూగర్భ మట్టాలు సగటున 7 మీటర్ల పెరిగాయి. ప్రస్తుతం మాదిరి ఎప్పుడూ 9 మీటర్ల స్థాయిలో పెరుగుదల లేదు. సాధారణంగా వర్షపాతం ఎంత నమోదైంది అన్న దానికంటే ఎంత ఎక్కువకాలం నమోదైంది అన్న అంశంపైనే భూగర్భ జల మట్టాల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలు ఎక్కువ రోజులు స్థిరంగా కురవడంతో నీరు భారీగా భూగర్భంలోకి చేరిందని అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది అనేక రిజర్వాయర్లల్లోకి పుష్కలంగా నీరు వచ్చింది. వాటి నుంచి దిగువకు నీటిని వదిలారు. గోదావరి బేసిన్‌లో ఏకంగా 30 వేలకు పైగా చెరువుల్లో నీటిమట్టాలు పూర్తి స్థాయికి చేరాయి. మిషన్‌ కాకతీయ కింద 18 వేలకు పైగా చెరువుల్లో పనులు జరగడం, ఫీడర్‌ ఛానళ్లు మెరుగవడం కూడా భూగర్భ జల మట్టాల పెరుగుదలకు దోహదపడింది. కురిసిన వర్షపాతంలో సగటున 10 నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని భూవిస్తీర్ణం, పెరిగిన మట్టాలను ఆధారంగా లెక్కిస్తే సుమారు 430 టీఎంసీల నీరు భూగర్భానికి చేరిందని అధికారులు చెబుతున్నారు. గతంలో మంచి వర్షాలు కురిసి, మట్టాలు పెరిగిన సందర్భాల్లోనూ 200 నుంచి 300 టీఎంసీలకు మించి నీరు భూగర్భానికి చేరలేదని, ప్రస్తుతం చేరిన నీరు రికార్డని అంటున్నారు.
===
రాష్ట్రంలో భూగర్భ జల మట్టాల పరిస్థితి ఇదీ.. (మీటర్లలో)
2015 అక్టోబర్‌: 11.27
2016 మే: 15.62
2016 సెప్టెంబర్‌: 8.98
2016 అక్టోబర్‌: 7.11
మే నెలతో పోలిస్తే పెరిగిన మట్టం: 8.69

మిషన్‌ కాకతీయ చెరువుల కింద ఇలా..
2016 మే: 17.97
2016 సెప్టెంబర్‌: 8.42
2016 అక్టోబర్‌: 9.68

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement