సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరాన్ని తొందరగా కట్టేయాలనే ఆత్రుత తప్ప అసలు ఆ ప్రాజెక్టు మనుగడ గురించి ఆలోచించలేదు. కటాఫ్‌వాల్ డిజైన్ మార్చకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఆర్‌సీసీతో కట్టి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఇసుకను సరైన విధంగా గట్టిపర్చలేకపోవడం వల్ల నష్టం జరిగింది. ఆర్‌సీసీతో వాల్ కట్టి ఉంటే రాఫ్ట్ కుంగేది కాదు.. డ్యామ్ కుచించుకుపోయి పగుళ్లకు ఆస్కారం ఏర్పడేది కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలోని ఈ మూడు పిల్లర్లే కాదని, అన్నారంలో కూడా బుడగలు వస్తున్నాయని, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ మొదలైందని చెప్పారు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందనీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాగా ఆత్రుత పడేది లేదని, తప్పులు చేసేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిందే తానని, తన మెదడులోనే ప్రాజెక్టు డిజైన్ ఉందని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని పొంగులేటి ప్రశ్నించారు.
కేసీఆర్ సభకు వచ్చి ఉంటే తనకున్న సమస్యకు పరిష్కారం చెప్పేవారు కదా అని ఎద్దేవా చేశారు. నాడు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పవిత్ర దేవాలయం అని చెప్పిన కేసీఆర్‌కు అదే ప్రాజెక్టు బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు.
పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే..
కనీస పరిశోధనలు లేకుండానే కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేశా రని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మట్టి పరీక్షలు, ఇతరాత్ర పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే ప్రాజెక్టులను కట్టడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వ్యవసాయానికి నీటిని అందించాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు చేస్తున్న వాదన అర్థరహితమన్నా రు.
నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేరా అని కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, అక్టోబర్ 21, 2023 రోజునే పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటి నుంచి దాదాపు 45 రోజుల పాటు కేసీఆరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నా రని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment