పంటలకు 354 టీఎంసీల సాగునీటి సరఫరా
నీటిపారుదల శాఖలోని స్కివం కమిటీ ప్రతిపాదన
గత ఏడాది 28.95 లక్షల ఎకరాల ఆయకట్టే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కళంగా ఉండడంతో యాసంగి సీజన్‌లో సిరుల పంట పండనుంది. 2024–25 యాసంగి సీజన్‌లో రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులతో పాటు చెరువులు, ఎత్తిపోతల కింద ఏకంగా 42,48,780 ఎకరాల ఆయకట్టుకు మొత్తం 354.88 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖలోని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఇందులో 24,54,429 ఎకరాల తడి (వెట్), 17,94,351 ఎకరాల పొడి (డ్రై/మెట్ట) పంటలున్నాయి. వర్షాభావంతో ప్రాజెక్టుల్లో నీళ్లు లేక గతేడాది యాసంగిలో కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్‌తో పాటు కల్వకుర్తి, బీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద పంటల విరామం ప్రకటించాల్సి వచ్చింది.
అప్పట్లో 28.95 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే స్కివం కమిటీ ప్రతిపాదించింది. మొత్తం మీద గత మూడేళ్లతో పోల్చితే 2024–25 యాసంగిలో ప్రాజెక్టుల కింద గణనీయంగా సాగు విస్తీర్ణం పెరగనుంది.
ఎస్సారెస్పీ స్టేజీ–1,2 కింద 11.36లక్షల ఎకరాలకు నీళ్లు
ఎస్సారెస్పీ స్టేజీ–1 కింద 4,40,903 ఎకరాల తడి, 3,58,569 ఎకరాల పొడి పంటలు కలిపి మొత్తం 7,99,472 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. స్టేజీ–2 కింద 2,59,230 ఎకరాల తడి, 77,400 ఎకరాల పొడి పంటలు కలిపి మొత్తం 3,36,630 ఎకరాల ఆయకట్టును కమిటీ ప్రతిపాదించింది.
ఇక నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా ఉండగా, సాగర్ ఎడమ కాల్వ కింద 6,38,385 ఎకరాలను కమిటీ ప్రతిపాదించింది. ఇందులో 4,75,890 ఎకరాల తడి, 475890 ఎకరాల పొడి పంటలున్నాయి.
కాళేశ్వరం కింద 93 వేల ఎకరాలకు నీళ్లు!
కాళేశ్వరం ప్రాజెక్టు కింద 93 వేల ఎకరాల ఆయకట్టును స్కివం కమిటీ ప్రతిపాదించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీళ్లను నిల్వ చేయడం లేదు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగుకు 34.86 టీఎంసీల జలాలు లభ్యతగా ఉన్నాయని స్కివం కమిటీ అంచనా వేసింది.
మల్లన్నసాగర్, కొండపొచమ్మసాగర్ తదితర జలాశయాల్లో ఉన్న నిల్వలకు తోడు గా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయనున్న నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment