నకిలీ అంబాసిడర్ హల్‌చల్
-
చెరువుల పరిశీలన పేరుతో హంగామా
-
అతడి వెంట అధికారుల పర్యటన
-
రాచమర్యాదల కోసం మైనర్ ఇరిగేషన్‌లో వేధింపులు
-
భరించలేక మంత్రి దృష్టికి.. ఐబీ జేఈకి మెమో
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పథకంపై ప్రచారం చేసేందుకు బ్రాడ్ అంబాసిడర్‌గా నియమించిందంటూ ఓ యువకుడు హల్‌చల్ సృష్టించిన సంఘటన ఆదివారం కురవి మండలంలో చోటుచేసుకుంది. హన్మకొండలో నివాసం ఉండే గంగాపురం అఖిల్ అనే యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు నగరంలోని ఏవీవీ కాలేజీలో 2015లో వరల్డ్ రికార్డులపై 48 గంటల పాటు ప్రసంగించాడు. ఈ విషయం మంత్రి హరీశ్‌రావు దృష్టికి వెళ్లడంతో ఆయన ముగ్ధుడై మిషన్ కాకతీయకు ‘యంగ్ అంబాసిడర్’గా నియమించారు. ఈ కార్యక్రమంపై పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగహన కల్పించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. ఇది పత్రికల్లో రావడంతో ఈ బాధ్యతలు స్వీకరించినట్లు ప్రచారం చేసుకున్న అఖిల్ గత ఏడాది మిషన్ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రచారం ఊపందుకోవడంతో ఎంఐ ఇంజనీరింగ్ అధికారులు అతనికి వాహన సౌకర్యం, వసతులు కల్పించారు. దీంతో రుచిమరిగిన అఖిల్.. రెండో విడత పనులు సందర్శించేందుకు తనకు సౌకర్యాలు కల్పించాలని ఇంజనీర్లను వేధించడమే కాకుండా నాణ్యత పేరుతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను వేధిస్తున్నట్లు తెలిసింది.
కురవిలో హడావిడి...
ఇదేక్రమంలో కురవికి ఆదివారం వచ్చిన అఖిల్‌కు కురవి ఐబీ జేఈ కిషన్‌నాయక్ మానుకోట నుంచి కారు ఏర్పాటు చేశారు. అంబాసిడర్‌గా చెప్పుకోవడంతో టీఆర్‌ఎస్ నాయకులు, ఐబీ అధికారులు ఆయన వెంట తిరిగారు. హడావిడిగా కురవి పెద్ద చెరువు, నారాయణపురం చెరువుల పనులను పరి శీలించాడు. కురవి చెరువు తూములను పరిశీలించి న అనంతరం టీఆర్‌ఎస్ నాయకుడు కొణతం విజయ్ చెరువు పనులు నాణ్యతగా చేయలేదని చెప్పగా అఖిల్ హల్‌చల్ చేశాడు.
ఉన్నతాధికారులకు ఇంజనీర్ల ఫిర్యాదు..
అఖిల్ వ్యవహారంతో విసుగెత్తిన ఇంజనీర్లు తమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా వారు మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. దీంతో ఆయన సమస్య పరిష్కరించాలని ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండేను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే పేరిట ప్రకటన వెలువడిందని ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిషన్ కాకతీయకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించలేదని, ఆ పేరుతో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను అఖిల్ బెదిరి స్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఇకనుంచి ఆఎవరైనా బెదిరిస్తే పోలీసులకు అప్పగించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకున్నా అఖిల్‌కు వాహన సౌకర్యం కల్పించిన కురవి జేఈకి మెమో జారీచేసినట్లు మానుకోట ఈఈ రత్నం తెలిపారు.