
‘మిషన్’ 3ని విజయవంతం చేయండి
⇒ మిషన్ కాకతీయ పనులపై ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్‌రావు లేఖ
⇒ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని సూచన
⇒ మూడో విడతలో 6,635 చెరువుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో దశను సైతం విజయవంతం చేయాలని రాష్ట్రంలోని శాసనసభ్యులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. మిషన్ కాకతీయ పథకంకింద కొనసాగుతున్న రెండో విడత పనుల పూర్తికి, మూడో విడత పనులు జయప్రదం కావడానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఎమ్మెల్యేలకు విడివిడిగా లేఖలు రాశారు. మిషన్ కాకతీయ రెండు విడతల ఫలితాలను మంత్రి తన లేఖలో సంక్షిప్తంగా తెలియజేస్తూ, తదుపరి విడతలో చేపట్టే పనులను వివరించారు.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం 17 వేల చెరువుల పునరుద్ధరణ పనులకు రూ.5,660 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు. పూడిక తీత, చెరువులకు నీటిని తరలించే ఫీడర్ కాలువల పునరుద్ధరణ, పంట కాలువల పునరుద్ధరణ, తూము, మత్తడి, ఇతర కట్టడాల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడం, చెరువుకట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, చెరువుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు, గుర్రపు డెక్క, మొదలైన వాటి నిర్మూలన, చెరువు శిఖంని గుర్తించి రాళ్ళు పాతడం, చెరువుకట్ట చుట్టూ హరితహారంలో భాగంగా చెట్లునాటడం తదితర పనులను చేపట్టినట్టు మంత్రి వివరించారు.
సాగులోకి 15 లక్షల ఎకరాలు..
మిషన్ కాకతీయ పథకం ప్రారంభించటానికి ముందు రాష్ట్రంలో చెరువుల కింద అత్యధికంగా సాగు అయిన భూమి 10.7 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది ఏకంగా 15లక్షల భూమి సాగులోకి వచ్చిందని మంత్రి హరీశ్ తెలిపారు. త్వరలో మూడో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడానికి అన్ని విధాలుగా సాగునీటి శాఖ సిద్ధమయిందన్నారు. ఈ నేపథ్యంలో మూడో విడత విజయవంతానికి ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు.
అన్ని జిల్లాల్లో కలిపి మూడో విడతలో మొత్తం 6,635 చెరువులను ఎంపిక చేశామని, ఇందులో 4 వేల చెరువులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని చెప్పారు. మూడో విడత పనులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను మొదలు పెట్టాలని, నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రతీ సందర్భంలో చెరువుల పనులను తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలను కోరారు. ప్రజల భాగస్వామ్యంతో, అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని సూచించారు.