
15 రోజుల్లో ‘కాకతీయ’ పనులు మొదలవ్వాలి
► చెరువుల పనులపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
► ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంలో పనులు చేపట్టాలి
► సీఈ, ఎస్‌ఈలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మూడో విడత మిషన్ కాకతీయ పనులు సంతృప్తిగా లేవని, రానున్న 15 రోజుల్లో 90 శాతం పనులు ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇంకా పూర్తికాని ఒకటి, రెండో విడత మిషన్ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని సూచించారు.
మూడో విడత మిషన్ కాకతీయ పనులపై మంత్రి మంగళవారం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రెండు విడతల్లో మిగిలిపోయిన పనులతో పాటు మిషన్ కాకతీయ 3లో మంజూరైన పనులు, వాటి పురోగతిని హరీశ్ సమీక్షించారు. మిషన్ కాకతీయ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. మిషన్ కాకతీయ 1లో జరిగిన పనుల్లో ఎక్కడైనా చిన్న, చిన్న మరమ్మతులు అవసరమైతే వాటిని వెంటనే చేపట్టాలని సూచించారు.
ప్రజలను భాగస్వాములను చేయాలి..
చెరువు పనుల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా ఉత్సవాలు జరిపి పనులు గ్రౌండింగ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు హాజరైనా, కాకపోయినా పనులు ప్రారంభించడానికి వెంటనే చర్యలు తీసుకో వాలని అధికారులకు సూచించారు. మూడో విడత పనుల గ్రౌండింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నందుకు ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ అభినందించా రు.
మైనర్ ఇరిగేషన్ సీఈ, ఎస్‌ఈలు, జిల్లాల ఇంచార్జి సీఈలు క్షేత్ర స్థాయిలో పర్యటిం చాలని, ఆకస్మికంగా తనిఖీలు చేయాలని, స్థానిక ఇంజనీర్లకు, సిబ్బందికి తగిన సూచన లు, సలహాలు ఇవ్వాలని సూచించారు. పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో సమీక్షిం చాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఈఎన్‌సీ మురళీధరరావు, భగవంతరావు, శ్యామసుందర్, మధుసూదనరావు, లింగరాజు, శ్యాంసుందర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.