సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు తొలి దశలోనే అందాయి. నీటి వనరులు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయం పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. మిషన్ కాకతీయ తొలి దశలో పునరుద్ధరించిన చెరువుల పరిధిలో.. సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడి, రసాయన ఎరువుల వినియోగం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై నాబార్డ్ పరిధిలోని ‘నాబ్కాన్’ సంస్థ అధ్యయనం చేసింది. 42 పేజీల నివేదికను రూపొందించింది. మిషన్ కాకతీయతో విప్లవాత్మక మార్పు వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఇది ఎంతగానో దోహదపడినట్టు అధ్యయనంలో తేలింది. రసాయన ఎరువుల వినియోగం కూడా తగ్గినట్టు నాబ్కాన్ వెల్లడించింది. ఆదివారమిక్కడ జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తమ నివేదికను విడుదల చేసింది. అనంతరం ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్కాన్’ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అధ్యయనం ఇలా..
మిషన్ కాకతీయ మొదటి దశ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అధ్యయనం చేశారు. చెరువుల కింద ఆయకట్టు రైతు కుటుంబాలు, వారితో చర్చలు, ఉపగ్రహ చిత్రాల పరిశీలన, విశ్లేషణ, కొన్ని చెరువులపై కేస్‌స్టడీ ఇతరత్రా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా మిషన్ కాకతీయ ప్రభావాలపై మదింపు చేశారు. మిషన్ కాకతీయకు ముందు 2013–14లో పరిస్థితులు, కాకతీయ అమలు తర్వాత 2016–17 ఏడాదిలో ఉన్న పరిస్థితులను పోల్చుతూ ఈ అధ్యయనం సాగింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో 400 చెరువుల పరిధిలోని 12 వేల కుటుంబాలను సర్వే కోసం ఎంపిక చేసి అధ్యయనం చేశారు. సర్వే కోసం ఎంపిక చేసిన అన్ని జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, ఆశాజనకంగా లేకపోవడంతో ఖరీఫ్ పంట దెబ్బతింది. దీని ప్రభావం ముఖ్యంగా మెదక్, నల్లగొండ జిల్లాపై అధికంగా ఉన్నట్లు తేలింది.
పెరిగిన సాగు విస్తీర్ణం..
2016 ఖరీఫ్‌లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా.. మిషన్ కాకతీయ కారణంగా పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5% సాగు విస్తీర్ణం పెరిగింది. 2016 సెప్టెంబర్ మూడో వారంలో కురిసిన వర్షాలకు చెరువులు నిండటంతో రబీ విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఖరీఫ్, రబీ కలిపి సాగు విస్తీర్ణంలో పెరుగుదలను చూస్తే.. కరీంనగర్‌లో అత్యధికంగా 62.5%, అతి ఎక్కువగా నల్లగొండలో 22.5% నమోదైంది. 2013–14 గ్యాప్ ఆయకట్టు 42.4 శాతంగా ఉండగా, 2016–17లో అది 23.2 శాతానికి తగ్గింది. నీటి వనరుల లభ్యత పెరగడంతో 2013తో పోలిస్తే 2016 ఖరీఫ్‌లో వరి సాగు 11.1 శాతం పెరిగింది. రబీ నాటికి అది 23.7 శాతానికి చేరింది. వరి దిగుబడిపరంగా చూస్తే ఖరీఫ్‌లో 4.4 శాతం, రబీలో 19.6 శాతం అధికంగా వచ్చింది.
ఆదాయం పెరిగింది..
సర్వే కోసం ఎంపిక చేసిన ఆయకట్టు రైతు కుటుంబాల్లో 8.5% పూడిక మట్టిని తమ చెలకల్లో, పొలాల్లో చల్లుకున్నారు. పూడిక మట్టి వాడటంతో రైతులకు ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల కొనుగోలు ఖర్చు తగ్గింది. పంట దిగుబడి ద్వారా ఆదాయం పెరిగింది. పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గింది. రైతుకు రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది. పంటల దిగుబడిపరంగా చూస్తే.. వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు పెరిగింది. చెరువు ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరగ్గా.. వ్యవసాయ ఆదాయం 47.4 శాతం పెరిగింది.
బోరు బావులకు పునరుజ్జీవం
ఎండిపోయిన బోరుబావులకు మిషన్ కాకతీయ ప్రాణం పోసింది. చెరువుల ఆయకట్టు కింద.. 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునర్జీవం పొందాయి. ఆయకట్టు బయట కూడా ఇలాంటి బావులు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. భూగర్భ జల మట్టాల్లో సరాసరి పెరుగుదల 2013–14లో 6.91 మీటర్లు ఉంటే.. 2016–17లో అది 9.02 మీటర్లకు పెరిగింది. చెరువుల్లో చేపల ఉత్పత్తి 2013–14తో పోలిస్తే 2016–17లో 36 నుంచి 39 శాతానికి పెరిగింది.
మారిన చెరువుల రూపురేఖలు
మిషన్ కాకతీయ అమలుకు ముందు 63% మంది చెరువులు బాగా లేవని చెప్పారు. మరో 3 శాతం మంది చెరువుల పరిస్థితి దారుణంగా ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ తర్వాత 46.7 శాతం మంది చెరువులు చాలా బాగున్నాయన్నారు. 38 శాతం చెరువులు బాగు పడ్డాయని ,11.2 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. 4.1 శాతం మంది చెరువులు బాగా లేవని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అమలు తర్వాత చెరువుల నిర్వహణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. చెరువుల బలోపేతం విషయంలోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. 2016–17 సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా చెరువులు తెగిపోవడం వంటి ఘటనలు గణనీయంగా తగ్గాయి. భారీ వర్షాలకు 2009లో 1,107, 2010లో 4,251, 2013లో 1,868, చెరువులు దెబ్బతినగా... 2016లో 571 మాత్రమే దెబ్బతిన్నాయి. మిషన్ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతం చేసినందు వల్లే ఇది సాధ్యమైందని నాబ్కాన్ తెలిపింది.
చెరువుల పరిరక్షణ చట్టం తెస్తాం: మంత్రి హరీశ్‌రావు
మిషన్ కాకతీయకు ప్రజల మద్దతు లభించింది. వారి మన్ననలు పొందింది. ప్రజా ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆశించిన మేర మొదటి దశ చెరువుల ఫలితాలొచ్చాయి. మున్ముందు రెండు, మూడో దశ ఫలితాలపైనా అధ్యయనం చేయిస్తాం. ఆయా సంస్థలు ఇచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని మిషన్ కాకతీయను మరింత సమర్థంగా చేపడతాం. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. చట్టం రూపకల్పన బాధ్యతను నల్సార్ యూనివర్సిటీకి అప్పగించాం.
Comments
Please login to add a commentAdd a comment