సామాజిక ఒత్తిడి పెరగాలి
⇒ ప్రాజెక్టులకు అడ్డుపడే శక్తులపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య
⇒ మిషన్ కాకతీయతో మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడి
⇒ ‘జల సంరక్షణ –సామాజిక బాధ్యత’ అంశంపై సెమినార్
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలో కొన్ని చట్టాలతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ చట్టాలను అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ శక్తులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి. ప్రాజెక్టులు ఆలస్యమైతే వాటి నిర్మాణ భారం పెరుగుతోందని, అంతిమంగా ఆ భారం ప్రజలపైనే పడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరిగి నిర్దేశించిన ఫలితాలు ఆలస్యమై ప్రజలకు అందాల్సిన ఫలాలు వేగంగా దక్కడం లేదు. ఈ దృష్ట్యా రాజకీయ కారణాలతో నీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న శక్తులపై సామాజిక ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.
ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి’ అని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయ పడ్డారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట్ లోని హరిత ప్లాజాలో ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ ఆధ్వర్యంలో ‘జల సంరక్షణ–సామాజిక బాధ్యత’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌కు మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర సాగునీటి పారుదల అభివృధ్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీపాటిల్, నీటి పారుదల రంగ నిపుణులు హాజరయ్యారు.
కాకతీయతో 15.80 లక్షల ఎకరాలు సాగులోకి..
హరీశ్ మాట్లాడుతూ ‘మన నిర్లక్ష్యం వల్లే నీటి కష్టాలు, తాగునీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు సముద్రంపాలు కాకుండా భద్ర పరుచుకోవలసిన బాధ్యతను గుర్తించే ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టింది. మిషన్ కాకతీయతో 15.80 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. మొన్నటి వర్షాల వల్ల చాలా చెరువుల్లో నీళ్లు ఉన్నందున ఈసారి ఫీడర్ల మీద దృష్టి పెడుతున్నాం’ అని వివరించారు. సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఆటవీ ప్రాంతాన్ని 30% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని కోసం 200 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు.
ఇక రాష్ట్రంలో అవసరానికి మించి వరి పండుతోందని, కిలో బియ్యానికి 4 వేల లీటర్ల నీళ్లు అవసరం అవుతున్నాయని చెప్పారు. కూలీల అవసరం తక్కువ కాబట్టి చాలా మంది వరి పండిస్తున్నారని, దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో కూరగాయలు, ఇతర పంటలు పండించే అవకాశం ఉందని, ఈ విషయంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.