ప్రాజెక్టుల పనుల్లో ఐఐటీ, బిట్స్ సేవలు
♦ సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఈ సంస్థల నుంచి సాయం
♦ అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఐఐటీ హైదరాబాద్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్) సేవలను వినియోగించుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీనిపై ఆయా సంస్థల అధికారులతో చర్చలు జర పనుంది. ఈ మేరకు ఆదివారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, బిట్స్ అధికారులతో చర్చల బాధ్యతను శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషికి కట్టబెట్టారు.
ఇక మిషన్ కాకతీయ మొదటి దశలో చేపట్టిన పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో పూర్తి చేసిన పనులకు ముగింపు నివేదిక ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో క్వాలిటీకంట్రోల్ విభాగంతో పాటు సీఈ నుంచి డీఈ వరకు తనిఖీలు చేయాలన్నారు. మిగిలిపోయిన పనులు ఉంటే వాటిని పూర్తి చేయించిన తర్వాతనే తుది బిల్లులు చెల్లించాలన్నారు. పనులు పూర్తయిన చెరువుల పరిరక్షణ, నిర్వహణపై గ్రామస్థాయిలో కమిటీలు వేయాలని అన్నారు. రెండో విడత పనులు ఆరంభమవుతున్నందున జిల్లా సమన్వయ కమిటీలను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని, నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.
పనులు ఆరంభించే చెరువుల్లో ముందుగానే మట్టి పరీక్షలు నిర్వహించేలా చూడాలని, పూడికమట్టిని రైతులు తీసుకువెళ్లడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారుల సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న ఏజెన్సీల పట్ల కఠినంగా వ్యవహరించాలని, పనిచేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, పురోగతి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు. పనుల్లో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఖాళీల భ ర్తీకి ఆదేశం..
నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టులను భర్తీ చేయాలని, జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, ఏటూరు నాగారం డివిజన్లకు ఈఈలను వెంటనే నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ క మిషన్ ద్వారా ఏఈఈల నియామకాలు జరుగబోతున్నాయని, వారి కి స్వల్పకాలిక శిక్షణనిచ్చి పనుల్లోకి దించాలని మంత్రి సూచించారు.