కృష్ణా, గోదారి నీటి మళ్లింపే దిక్కు
♦ రైతు ఆత్మహత్యల నివారణపై మంత్రి హరీశ్‌రావు
♦ వాటా నీటితో ఆదర్శ తెలంగాణను ఆవిష్కరిస్తాం
♦ అత్యుత్తమ కథనాలు రాసిన మీడియా ప్రతినిధులకు అవార్డులు అందజేత
♦ ప్రింట్ విభాగంలో ‘సాక్షి’ కరీంనగర్ కథనానికి రెండో బహుమతి
♦ పాల్గొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కె.రామచంద్రమూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు కృష్ణా, గోదావరి నీటిని పొలాలకు మళ్లించడమే శరణ్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. గోదావరిలో 954 టీఎంసీలు, కృష్ణా లో 376 టీఎంసీల వాటా నీటిని వాడుకొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన చుక్క నీటిని తీసుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని, న్యాయమైన వాటా నీటిని, ప్రతి వర్షపు చుక్కను సాగు అవసరాలకు మళ్లించి ఆదర్శ తెలంగాణను ఆవి ష్కరిస్తామని అన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో జరిగిన ‘మిషన్ కాకతీయ’ మీడియా అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హరీశ్‌రావు, జ్యూరీ సభ్యులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఎక్కడైతే నీటి సౌకర్యం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవో అక్కడే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ దృష్ట్యా ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని అన్నారు.
ప్రజల భాగస్వామ్యం పెంచాలి: అల్లం
రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే చెరువుల పునరుద్ధరణ జరగాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. స్థాని కంగా నీటిని ఒడిసిపట్టుకునే దిశగా ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలన్నారు. సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చెరువుతో ముడిపడి ఉందన్నారు. చెరువు బాగుంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, పర్యావరణ సమతౌల్యత సాధ్యమవుతుందని అన్నారు. చెరువు బాగుంటే గ్రామం, గ్రామం బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రజా ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ జరగాలని సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
అవార్డులు అందుకున్నది వీరే..
ప్రింట్ మీడియా: పైడిపల్లి అరుణ్ కుమార్ (సాక్షి హుజూరాబాద్, కరీంనగర్-ద్వితీయ బహుమతి), నూర శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ, వరంగల్-ప్రథమ బహుమతి), మహేశ్ అవధూత (హన్స్ ఇండియా, హైదరాబాద్-తృతీయ బహుమతి), ప్రత్యేక జూరీ అవార్డు కునాల్ శంకర్ (ఫ్రంట్‌లైన్, హైదరాబాద్), నర్సాగౌడ్ (నమస్తే తెలంగాణ-సదాశివనగర్, నిజామాబాద్).
ఎలక్ట్రానిక్ మీడియా: వంగపల్లి పద్మ (10 టీవీ, హైదరాబాద్ -ప్రథమ బహుమతి), వి.భూమేశ్వర్ (జెమినీ టీవీ ద్వితీయ బహుమతి), సతీశ్(ఈటీవీ తెలంగాణ ద్వితీయ బహుమతి), వేణుగోపాల్‌రావు (టీన్యూస్, కరీంనగర్ తృతీయ బహుమతి), శ్రీరాములు (దూరదర్శన్, హైదరాబాద్ తృతీయ బహుమతి). మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ. 50 వేలు, మూడో బహుమతిగా రూ. 25 వేలు, ప్రత్యేక జ్యూరీ బహుమతికి రూ. 25 వేలు, ప్రశంసాపత్రం, మెమొం టోను హరీశ్, జ్యూరీ సభ్యులు అందజేశారు.
విదేశీ సంస్థలూ మిషన్ కాకతీయను గుర్తించాయి..
అన్ని వర్గాలకు బతుకుదెరువుగా ఉన్న చెరువులను పునరుద్ధరించి గ్రామ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమంపై నీతి ఆయోగ్, హైకోర్టు, కేంద్ర మంత్రి ఉమా భారతి తదితరుల అభినందనలు దక్కాయని, అమెరికాలోని మిషిగన్, షికాగో యూనివర్సిటీలు మిషన్ కాకతీయ ఫలితాలపై అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని, వారి భాగస్వామ్యం పెరగాలంటే మీడి యా చొరవ మరింత అవసరమన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఐదేళ్లూ మీడియా అవార్డులు కొనసాగిస్తామన్నారు.