22న ఢిల్లీకి మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో ఢిల్లీలో జల్‌మంథన్ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ నుంచి అందిన ఆహ్వానం మేరకు హారీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో నదీ జలాల లభ్యత, భూగర్భ జల పరిస్థితులు, నీటి నిర్వహణ, సంరక్షణపై 2 రోజుల పాటు చర్చ జరగనుంది. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర జల విధానం, మిషన్ కాకతీయ, 60 శాతానికి పైగా వ్యవసాయ యోగ్య భూమికి ఆయకట్టునిచ్చేలా రూపొందిస్తున్న ప్రణాళికలను ఆయన కేంద్రానికి వివరించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయపై జల్‌మంథన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్రాన్ని కోరగా, అధికారులు అందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం వంటి అంశాలను మంత్రి ప్రస్తావించే అవకాశ ం ఉంది. ఈ పర్యటనలో మంత్రి హరీశ్ వెంట నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు వెళ్లనున్నారు.