‘కాకతీయ’ పనుల తీరుపై మంత్రి హరీశ్ ఆవేదన
ప్రజాప్రతినిధులు తొలి దశలో చూపినంత చొరవ చూపడం లేదని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ పనులు మందకొడిగా సాగుతుండటంపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు తొలి దశలో చూపినంత చురుకుదనం రెండో దశలో చూపడం లేదని, ఈ కారణంగా పలు నియోజకవర్గాల్లో రెండో దశ పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. చెరువు పనుల్లో కరీంనగర్, వరంగల్ జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయని, శాసనసభ్యులు ఉత్సాహం చూపని కారణంగా పనులు ప్రారంభం కాలేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో 742 పనుల టెండర్లు పూర్తవ్వగా.. 589 ప్రారంభమయ్యాయని, మిగతా జిల్లాల్లో మాత్రం 50 శాతం కూడా మొదలుకాలేదన్నారు. ఏప్రిల్ రెండోవారం గడిచినా పనులు ప్రారంభం కాకపోతే వర్షాకాలం లోగా ఎలా పూర్తి చేస్తామని ప్రశ్నించారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఇంటిపనిగా భావించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. రైతుల ఆత్మహత్యల నివారణ ఎజెండాతో చేపట్టిన మిషన్ కాకతీయ ఉద్యమంలో సాగేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.