ప్రాజెక్టుల వేగం పెంచండి
⇒ మధ్యతరహా ప్రాజెక్టులపై హరీశ్
⇒ జూలై కల్లా పూర్తి చేసి ఖరీఫ్‌కు సాగు నీరందించాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ జూలై కల్లా పూర్తిచేసి ఖరీఫ్‌కు సాగు నీరందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. చనాఖా–కొరటా ప్రాజెక్టు పనులు వేగవం తం చేయాలని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని రికార్డు సమయంలో సదర్‌మాట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి శనివారం నాడు సుదీర్ఘంగా సమీక్షించారు.
జలసౌధలో జరిగిన సమీక్షలో ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు విద్యాసాగరరావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర రావు, ఆదిలాబాద్, ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈలు భగవంతరావు, శంకర్, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, పలువురు ఎస్‌ఈలు, ఈఈలు, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. చనాకా– కొరటా ప్రాజెక్టు పనులను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌజ్ లు, ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు ఏక కాలంలో పూర్తి చేయాలన్నారు.
చనాఖా–కొరటా, సాత్నాల, తమ్మిడి హెట్టి, సదర్ మాట్, కడెం కెనాల్స్, బాసర చెక్ డ్యాం తో పాటు కొమురం భీం, జగన్నాధపూర్, పీపీ రావు, స్వర్ణ, చలిమెల వాగు, గడ్డన్న వాగు, మత్తడి వాగు, ర్యాలివాగు, గొల్లవాగు, నీల్వాయి వంటి మీడియం ఇరిగేషన్ పథకాల పురోగతిని సమీక్షించిన మంత్రి వాటిపనుల్లో వేగం పెంచాలని కోరారు. గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు పథకాలను జూన్ చివరిలోగా పూర్తి చేసి వందశాతం ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. మత్తడి వాగు పథకం ఈ మార్చి చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కొమ్రంభీం, జగన్నాథపూర్ పథకాలను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా మంత్రి టైమ్ లైన్ ఖరారు చేశారు.