ఉదయ సముద్రానికి ‘మార్చ్‌’ టార్గెట్‌! | Land acquisition as barrier | Sakshi
Sakshi News home page

ఉదయ సముద్రానికి ‘మార్చ్‌’ టార్గెట్‌!

Published Mon, Dec 4 2017 1:58 AM | Last Updated on Mon, Dec 4 2017 4:24 AM

Land acquisition as barrier - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాత నల్లగొండ జిల్లాలోని మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టిన ఉదయ సముద్రం పథకాన్ని వచ్చే మార్చ్‌ నాటికి పూర్తి చేసేలా నీటి పారుదల శాఖకు ప్రభుత్వం టార్గెట్‌ విధించింది. నిర్ణీత ఆయకట్టులో సగానికైనా నీరిచ్చేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రాజెక్టులో ప్రధాన అవరోధంగా ఉన్న టన్నెల్‌ నిర్మాణ పనులను వేగిరం చేయాలని, ఫిబ్రవరి చివరి నాటికి ఒక పంపునైనా నడిపేలా పనులు చేయాలని అధికారులు, ఏజెన్సీలను నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించడంతో  ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి.

టన్నెల్‌ పూర్తయితే నీరు పారినట్లే
ఎల్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ప్రధాన కాల్వకు ఎగువన మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి నియోజవర్గాల్లోని 107 గ్రామాలకు తాగునీటితోపాటే లక్ష ఎకరాలకు నీరిచ్చేలా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని 2008లో చేపట్టారు. రూ.561.96 కోట్ల విలువైన  పనులను మయితా స్‌–మెయిల్‌–కేబీఎల్‌ సంస్థలు చేపట్టాయి. మొదట్లో పనులు వేగంగా జరిగినా, తదనంతరం ఇసుక కొరత, భూ సేకరణలో జాప్యంతో నెమ్మదించాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం పనులకు తిరిగి జీవం పోసింది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపడంతో ఏజెన్సీలు పనుల్లో వేగం పెంచాయి. దీంతో ఉదయ సముద్రం రిజర్వాయర్‌ నుంచి 6.9 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్‌ చానల్‌ల తవ్వకం పూర్తి కాగా, హెడ్‌ రెగ్యులేటరీ పనులుసాగుతున్నాయి. ఇక కాల్వ లైనింగ్‌ పనులను ప్రారంభించాల్సి ఉంది.

అప్రోచ్‌ చానల్‌ అనంతరం 10.62 కిలోమీటర్ల మేర టన్నెల్‌ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇందులో 9.97 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది.ఇవి పూర్తయితే నీటి సరఫరాకు సగం అడ్డంకులు తొలగినట్లేనని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. టన్నెల్‌ చివరన పంప్‌హౌజ్‌ తవ్వకం పూర్తి కాగా, పంపుల నిర్మాణం సాగుతోంది. ఇక్కడ రెండు పంపు మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, మార్చికి ఒక్క పంపునైనా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టారు. 0.302 టీఎంసీ సామర్థ్యంతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌ పనులు పూర్తి వచ్చాయి. అయితే కాల్వల పనులకు భూసేకరణ అవరోధంగా మారింది. ఇక్కడ 3,848 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1,118 ఎకరాల సేకరణ పూర్తయింది. మార్చి నాటికి పూర్తి స్థాయి సేకరణ సాధ్యపడే అవకాశం లేనందున కాల్వల నిర్మాణం పూర్తయిన పరిధిలో మొత్తంగా లక్ష ఎకరాల ఆయకట్టులో కనీసం 50 వేల నుంచి 60 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రాజెక్టు అధికారులకు హరీశ్‌రావు లక్ష్యం పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement