31.90 లక్షల ఎకరాలకు నీళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద కలిపి ప్రస్తుత రబీలో 31.90 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. రబీ పంట వేసే చిట్టచివరి ైరె తు ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నాడిక్కడ జలసౌధలో రబీ కార్యాచరణ ప్రణాళికపై సీఈ, ఎస్‌ఈలతో మంత్రి సుదీర్ఘంగా తొమ్మిది గంటల పాటు చర్చించారు. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులవారీగా ఆయకట్టుపై సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను ఆరా తీశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మట్లాడుతూ.. 2017 చివరికల్లా మొత్తం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న కాళేశ్వరం, దక్షిణ తెలంగాణ లైఫ్ లైన్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని సూచించారు. భక్త రామదాసు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండోదశ, సింగూరు కెనాల్, కల్వకుర్తి, నెట్టింపాడు, కోరుుల్ సాగర్, బీమా ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్‌లోపు పూర్తిచేసి నిర్దేశించిన ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. 2018లోగా వరద కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం పనులు పూర్తి చేయాల్సి ఉందని హరీశ్ అన్నారు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు టన్నెల్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఏళ్ల తరబడి పూర్తి కాకుండా ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకం ఏడాదిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మీడియం ప్రాజెక్టులైన కిన్నెరసాని, పాలెం వాగు, గొల్లవాగు, ర్యాలివాగు, నీల్వారుు, కొమురం భీమ్, పెద్దవాగు(జగన్నాథపూర్), మత్తడి వాగు ప్రాజెక్టులను కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని సూచించారు. లెండి, మొండికుంట వాగు పథకాలను 2018లోపు పూర్తి చేయాలన్నారు.
సమన్వయంతో ముందుకెళ్లండి..
మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో సాగునీటి పథకాలకు కొంత అడ్డంకిగా ఉన్న రైల్వే క్రాసింగ్ సమస్యలన్నీ ఆరు నెలల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. టెండరు పిలవడంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని, నెలల కాలపరిమితితోనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలనిఅధికారులకు సూచిం చారు. ఈసారి కుండపోత వర్షాలతో జలాశయాలన్నీ నిండినందున రబీ సాగు కచ్చితంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదని, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని రబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాలవారీగా ఆయకట్టును ఖరారు చేయాలని అధికారులకు హరీశ్‌రావు సూచించారు. వెంటనే జిల్లా ఇరిగేషన్ బోర్డు సమావేశాల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్లతో చర్చించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదల స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, సెక్రటరీ వికాస్‌రాజ్, ఈఎన్‌సీలు మురళీధర్, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్లు ఎన్. వెంకటేశ్వర్లు, బి.హరిరామ్, అనిల్, సునీల్, లింగరాజు, శంకర్, భగవంతరావు, ఖగేందర్‌రావు, మధుసూదన్, పద్మారావు తదితర సీఈ, ఎస్‌ఈలు పాల్గొన్నారు.