ధాన్యం దండెత్తింది | Grain Higher yields | Sakshi
Sakshi News home page

ధాన్యం దండెత్తింది

Published Sun, May 21 2017 3:44 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

ధాన్యం దండెత్తింది

ధాన్యం దండెత్తింది

- ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు
- అంచనా 29.5 లక్షల మెట్రిక్‌ టన్నులు..చేతికొచ్చింది 41 లక్షల మెట్రిక్‌ టన్నులు
- రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు
- మిల్లర్లు, లారీ యజమానులతో యుద్ధ ప్రాతిపదికన చర్చలు


సాక్షి, సిద్దిపేట: అన్నదాత పంట పండింది. దండిగా ధాన్యం మార్కెట్‌ మీదకు దండెత్తి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. మిషన్‌ కాకతీయతో చెరువులు నిండి, బావులు, బోర్లు ఊట పట్టడం.. దానికి నిరంతరాయ విద్యుత్‌ తోడు కావటం యాసంగికి కలిసొచ్చింది. పుట్ల కొద్దీ ధాన్యం పోటెత్తడంతో మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. అదే సమయంలో ఖమ్మం మిర్చి యార్డుకు రైతులు నిప్పు పెట్టడం.. అక్కడక్కడా రైతాంగం నిరసనలకు దిగటంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు రంగంలో దిగారు. పోటెత్తుతున్న ధాన్యానికి ధీటుగా అధికారులను మానసికంగా సిద్ధం చేశారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ ఏడాది రబీ సీజన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 31.5 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రబీలో ఇంత విస్తీర్ణంలో వరిసాగు చేయడం వ్యవసాయశాఖ చరిత్రలోనే ఇది తొలిసారి.  

రాష్ట్ర వ్యాప్తంగా 41.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం
రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 29.5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి రావచ్చని అధి కారులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. మార్కెట్‌కు తరలివస్తున్న ధాన్యం తీరును చూస్తే 41.67 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు రావచ్చని భావిస్తు న్నారు. అయితే, మార్కెట్‌లో ధాన్యం పోయడానికి జాగ లేదు. నింపటానికి బస్తాలు, తూకం వేయడానికి హమాలీలు,  తరలించడానికి లారీలు లేవు. దీనికి తోడుగా మార్కెట్‌లోకి బతుకమ్మ వడ్ల రాశులు వస్తున్నాయి. ఈ రకం వడ్లకు మార్కెటింగ్‌ శాఖ గుర్తింపు లేక అదో గందరగోళం. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు స్పందించి వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్‌ సప్లయిస్‌ అధికారులను ఏకతాటి మీదకు తెచ్చారు.

లారీల కొరత
ఒప్పందం చేసుకున్నంతగా ఏజెన్సీలు లారీలను పంపలేకపోయాయి. ఒక్కో జిల్లాకు రోజుకు సగటున 400 లారీలు అవసరం. 31 జిల్లాలకు కనీసం 12,400 లారీలు అవసరం. వీటికోసం అధికారులు రోడ్డెక్కారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల లారీలను మినహాయించి, మిగిలిన లారీలను మార్కెట్‌ వైపు మళ్లించారు. ధాన్యం లోడ్‌ చేసి మార్కెట్‌ ఖాళీ చేయించారు. లారీల్లోనైతే ధాన్యం ఎత్తారు, కానీ వాటిని నిల్వ చేయడానికి గోదాములు ఖాళీ లేవు.

గోదాముల సమస్య
రాష్ట్రంలో పాతవి 4.14 లక్షల మెట్రిక్‌ టన్నులు సామర్థ్యం, కొత్తవి 17.85 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయి. మొత్తం కలిపి 21.99 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేయొచ్చు. కానీ పంట దిగుబడి వచ్చిందేమో 41.67 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఈ కొరత నుంచి గట్టెక్కేందుకు హరీశ్‌రావు రైస్‌ మిల్లర్ల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఒక్కో మిల్లుకు 4000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. దానికి అదనంగా మరో 1000 మెట్రిక్‌ టన్నులను చేర్చారు. మొత్తం 16.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లులు నిర్విరామంగా పనిచేయాలని ఒప్పించారు. ఇక ధాన్యానికి వచ్చిన డబ్బును రైతు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. . ఇప్పటివరకు 4.02 లక్షల మందిS రైతుల వద్ద నుంచి 28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. రూ.3598 కోట్లు రైతులు ఆర్జించారు. ఇందులో రూ.2300 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మంత్రి ఇప్పుడు ఈ లావాదేవీలపై దృష్టి పెట్టారు.  

చివరి గింజ వరకు కొంటాం..
చెరువులు నిండినయ్, రైతన్నలు కష్టపడ్డారు. కష్టానికి తగిన ఫలితం వచ్చింది. గతంలో ఎప్పుడూ చూడనంతగా దిగుబడులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ, సివిల్‌ సప్లయిస్, మార్కెటింగ్, రవాణా శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. కొనుగోళ్లకు ఇబ్బంది లేదు. రైతన్న కష్టానికి నాది భరోసా. మార్కెట్‌కు వచ్చే చివరి గింజను కూడా కొనుగోలు చేస్తాం. బతుకమ్మ వడ్లకు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్టిఫికెట్‌ ఇచ్చింది. సమస్య లేదు. మీ ప్రతి రూపాయి లెక్కగట్టి మీ ఖాతాల్లో జమ చేస్తాం.  
    – టి.హరీశ్‌రావు, మార్కెటింగ్‌ శాఖ మంత్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement