మిషన్‌కాకతీయ ఫైనల్ బిల్లులివ్వండి
-
ఫేజ్ 2 కింద చెరువులు పూర్తి చేయండి
-
వర్షాలు తగ్గితే మైనర్ పనులు చేపట్టండి
-
మిషన్‌కాకతీయ ఎస్‌ఈ పీఏ వెంకటకృష్ణ
తిమ్మాపూర్: జిల్లాలో మిషన్ కాకతీయ ఫేజ్–1 కింద చెరువుల పనులు పూర్తిచేసి వాటికి సంబంధించి ఫైనల్ బిల్లులివ్వాలని మిషన్‌కాకతీయ ఎస్‌ఈ పీఏ వెంకటకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో మిషన్ కాకతీయ చెరువులకు జియో ట్యాగింగ్‌పై ఇంజినీర్లకు శిక్షణ అనంతరం పనులపై డివిజన్ల వారీగా ఎల్‌ఎండీలోని ఏసీఈ ఆఫీస్‌లో బుధవారం సమీక్ష జరిపారు. ఎస్‌ఈ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఫేజ్–1కింద జిల్లాలో 823 చెరువులకు రూ.311కోట్లు మంజూరైతే 720 పూర్తిచేసి రూ.90కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగతావి త్వరగా పూర్తిచేసి వాటి ఫైనల్ బిల్లులు చెల్లించాలని సూచించారు. మిషన్‌కాకతీయ ఫేజ్–2 కింద 1081 చెరువులకు ప్రభుత్వం అనుమతిస్తే రూ.468 కోట్లకు మంజూరు ఇచ్చామని, 1,050 చెరువులు ప్రారంభించగా వంద చెరువుల పనులు పూర్తయినట్లు తెలిపారు. చెరువుల్లో 95లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసినట్లు పేర్కొన్నారు. వర్షాలతో పనులు ఆలస్యమవుతున్నా వర్షాలు లేనప్పుడు మైనర్ పనులు చేపట్టాలని సూచించారు.
జియో ట్యాగింగ్‌పై శిక్షణ
మిషన్ కాకతీయలో పనిచేస్తున్న ఇంజినీర్లకు బుధవారం మండలంలోని పలు చెరువుల వద్ద క్షేత్రస్థాయిలో, ఎల్‌ఎండీలోని ఎస్‌ఈ ఆఫీస్‌లో నిపుణులు కౌశిక్, శర్మ, నాయుడు, అజయ్ శిక్షణ ఇచ్చారు. చెరువుల పూర్తి వివరాలు, పేర్లను మొబైల్‌లో నమోదు చేస్తే ఆ చెరువుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇస్తారని, దీని ద్వారా పేర్లు ఎన్ని ఉన్నా ఒక చెరువుకు ఒకే నంబర్ ఉంటుందని, డూప్లికేషన్ జరిగే అవకాశం ఉండదన్నారు. చెరువుల పనులను ఫొటో చేసి అందులో అప్‌లోడ్ చేస్తూ ఎక్కడైనా చూసుకోవచ్చని తెలిపారు. జియో నంబర్ ద్వారా భవిష్యత్తులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందన్నారు. చెరువుల జియో ట్యాగింగ్‌ని ఈ నెల 10తేదీలోగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఎస్‌ఈ ఆదేశించారు. ఈఈలు శ్రీనివాస్‌గుప్త, వివిధ డివిజన్ల ఈఈలు, డీఈఈలు, జేఈలు పాల్గొన్నారు.