మిషన్ కాకతీయ వానలు కురిస్తే పండుగే
మొదటి, రెండో విడత కలిపి సుమారు 15 వేల చెరువుల్లో పూడికతీత
- మూడో విడత జనవరి నుంచే చేపట్టేందుకు నిర్ణయం
- వర్షాలు సమృద్ధిగా కురిస్తే రాష్ట్రంలో తీరిపోనున్న కరువు
- గతేడాది వర్షాలు లేక నిండని చెరువులు
- రాజకీయ జోక్యం తగ్గిస్తే ‘మిషన్ కాకతీయ’ మరింత ప్రయోజనకరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) ఫలితాలు ఈ ఏడాది నుంచే చేతికందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి వర్షాలు సాధారణ స్థాయిలో కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో... చెరువులన్నీ జల కళను సంతరించుకోనున్నాయి. పూడికతీతతో ఎక్కువ నీటిని ఒడిసిపట్టుకుని రాష్ట్రంలో సాగుకు ఆయువుపట్టుగా మారనున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో చిన్న నీటి వనరులకు కేటాయించిన 262 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలతో ఇప్పటికే 10 వేలకు పైగా చెరువుల్లో పూడికతీత పనులు పూర్తికాగా.. మరో 8 వేల చెరువుల్లో పనులు జోరుగా సాగుతున్నాయి.
జూన్ మూడో వారానికి 15 వేల చెరువులు సిద్ధం
చిన్న నీటి వనరుల కింద 20.09 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో ఏడాదికి సుమారు 9 వేల చెరువుల చొప్పున మొత్తంగా 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఐదేళ్లలో సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనుంది. తొలి విడతలో 8,104 చెరువులకు పరిపాలనా అనుమతివ్వగా.. 8,032 చెరువుల పనులు చేపట్టారు. వీటిని అంచనా విలువ రూ.2,591.18 కోట్లుకాగా... పోటీ ఎక్కువగా ఉండడంతో కాంట్రాక్టర్లు లెస్‌కు వెళ్లి టెండర్లు దక్కించుకున్నారు. దీంతో రూ.1,596.44 కోట్లతోనే 8 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రెండో విడతలో 8,500 చెరువులను రూ.2,700 కోట్లతో చేపట్టగా 8,200 చెరువుల పనులు మొదలయ్యాయి. మొదటి, రెండో విడత కలిపి మొత్తంగా జూన్ మూడో వారం నాటికి 15 వేల చెరువుల పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక మూడో విడతకు అప్పుడే ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది పనులను జనవరి నుంచే ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు.
వర్షాల కోసం ఎదురుచూపులు
చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తవుతుండడంతో ఇప్పుడు రైతుల చూపంతా వర్షాలపై పడింది. గత ఏడాది రాష్ట్రంలోని 46 వేలకుపైగా చెరువుల్లో సగం చెరువుల్లో 25 శాతంకన్నా తక్కువగా నీరు చేరింది. 19 శాతం చెరువుల్లో అయితే చుక్క నీటికీ కరువు ఏర్పడింది. కృష్ణా బేసిన్‌లోని మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 23,034 చెరువులుండగా.. అందులోని 8,139 చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. 12,109 చెరువుల్లో 25 శాతం, 615 చెరువుల్లో 75 శాతానికిపైగా నీరు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకంగా 90 శాతం చెరువులు (6,976) బోసిపోయాయి. ఇక గోదావరి నది పరిధిలో మొత్తంగా 23,497 చెరువులుండగా.. 10 వేలకుపైగా చెరువుల్లో 25 శాతం కంటే తక్కువ నీరు చేరింది. 6,700 చెరువుల్లో మాత్రమే 75 శాతం వరకు పైగా నీరు నిండింది. ఒక్క కరీంనగర్‌లోనే 4 వేల చెరువుల్లో 25 శాతానికంటే తక్కువగా నీరు చేరింది. దీంతో చెరువుల పునరుద్ధరణ ఫలాలు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి.
ఈ సమస్యలను తీరాలి..
మిషన్ కాకతీయ పనుల టెండర్ల నుంచే వివాదాలు ముసురుకున్నా వాటిని అడ్డుకోవడంలో ప్రభుత్వం కొంత సఫలమైంది. అయితే శాఖల మధ్య సమన్వయం కొరవడి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టెండర్లు పిలవడంలో ఆలస్యం జరగడంతో ఈ ఏడాది నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసి మూడో విడతను డిసెంబర్‌లోనే మొదలుపెట్టాలని సర్కారు యోచిస్తోంది. ఇక ప్రస్తుతం పునరుద్ధరిస్తున్న చెరువులను రక్షించుకోవడం ఆ శాఖకు కీలకంగా మారింది. కబ్జాల బారిన పడకుండా చర్యలు, హద్దుల నిర్ణయం పకడ్బందీగా చేయడం, కబ్జాల నివారణలో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్లు. దీనికోసం సమగ్ర చట్టాన్ని తేవాల్సి ఉంది.