రూ.1,200 కోట్ల నష్టం | Loss of Rs 1,200 crore because of rains | Sakshi
Sakshi News home page

రూ.1,200 కోట్ల నష్టం

Published Tue, Sep 27 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

రూ.1,200 కోట్ల నష్టం

రూ.1,200 కోట్ల నష్టం

- వర్షాలపై ప్రభుత్వం ప్రాథమిక అంచనా
- హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతుకు రూ.100 కోట్లు: జీహెచ్‌ఎంసీ

 సాక్షి, హైదరాబాద్: వరుసగా కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం సంభవించింది. పంట నష్టం, రోడ్లు, ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులన్నీ కలిపితే దాదాపు రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. దాదాపు 2.5 లక్షల హెక్టార్లలో  పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఖమ్మం మినహా 8 జిల్లాల్లో పంటలపై వర్షాల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అత్యధికంగా మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో పంటనష్టం సంభవించింది. సోమవారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురియడంతో నష్టాన్ని అధికారులు పూర్తిగా అంచనా వేయలేకపోయారు.

అత్యధికంగా మెదక్ జిల్లాలో 54 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 20 వేల హెక్టార్లు, నల్లగొండ జిల్లాలో 20,500 హెక్టార్లు, రంగారెడ్డి జిల్లాలో 12,818 హెక్టార్లు, వరంగల్ జిల్లాలో 5,200 హెక్టార్లు, ఆదిలాబాద్ జిల్లాలో 1,600 హెక్టార్లు, కరీంనగర్‌లో 1,099 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అన్ని జిల్లాల నుంచి అందిన ప్రాథమిక సమాచారంతో వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. సోమవారం అన్ని జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపింది. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జిల్లాల నుంచి తమకు ఇంకా సమాచారం రాలేదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. అన్ని శాఖల నుంచి సమాచారం రాగానే కేంద్రానికి నివేదిక పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 రోడ్ల నష్టం ఇదీ..: వర్షాల ధాటికి రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ.400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆర్‌అండ్‌బీ విభాగం అంచనా వేసింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయని, 112 కల్వర్టులు, 71 చోట్ల వంతెనల లైనింగ్ కొట్టుకుపోయిందని గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 504 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 581 కిలోమీటర్ల పొడవు రోడ్లు చెడిపోయినట్లు అన్ని జిల్లాల నుంచి ఆ విభాగానికి నివేదికలందాయి. దీంతో ప్రాథమికంగా రూ.150 కోట్లు అవసరమని లెక్కలేసింది. మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో దాదాపు 28 వేల చెరువుల్లో నీరు నిండింది. వివిధ ప్రాంతాల్లో 137 చోట్ల చెరువులకు బుంగలు, గండ్లు పడ్డాయి. వీటిని వెంటనే పూడ్చివేసినప్పటికీ దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేసింది.

 రూ.100 కోట్లు అడిగిన జీహెచ్‌ఎంసీ: వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవటంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేసేందుకు తక్షణమే రూ.100 కోట్లు కావాలని కోరుతూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖకు జీహెచ్‌ఎంసీ నివేదిక సమర్పించింది. నగరంలో దాదాపు 1,124 ప్రాంతాల్లో 171 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నట్లుగా ఈ నివేదికలో వివరించింది.

 అంచనాలకు మించిన వర్షపాతం: సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈ నెలలో రెట్టింపు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో 26 వరకు సాధారణ  వర్షపాతం 98 మి.మీ.లు కాగా.. ఇప్పటివరకు దాదాపు రెండింతల వర్షపాతం నమోదైంది. గడిచిన 26 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 183.6 మి.మీల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే హైదరాబాద్‌లో అంచనాలకు మించి అయిదు రెట్లు, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాధారణం కంటే మూడింతల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు  హైదరాబాద్‌లో 354.3 మి.మీ., రంగారెడ్డి జిల్లాలో 258 మి.మీ. వర్షపాతం నమోదయింది. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ రెట్టింపు వర్షం కురిసింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ సెప్టెంబర్‌లో కురవాల్సిన స్థాయిని దాటిన వర్షాలు కురిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement